Chandrababu Naidu: విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన

Chandrababu Naidu UAE Tour a Grand Success New Trade Ties Forged
  • ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన యూఏఈ మంత్రులు, పారిశ్రామికవేత్తలు
  • అమరావతిలో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన యూఏఈ ప్రభుత్వం
  • త్వరలో ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపుతామని విదేశీ వాణిజ్య మంత్రి హామీ
  • ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం
  • డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌ రంగాల్లో భాగస్వామ్యానికి దుబాయ్ సుముఖత
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో.. యూఏఈ ప్రభుత్వ మంత్రులు, ప్రముఖ వాణిజ్య సంస్థల అధిపతులతో జరిపిన వరుస సమావేశాలు ఫలవంతమయ్యాయి. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించి, రాష్ట్రంలో భాగస్వాములు కావాలని వారిని చంద్రబాబు ఆహ్వానించారు.

పర్యటన చివరి రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి.. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులతో పాటు ఇరుపక్షాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పాలన, పౌరసేవలను మెరుగుపరిచేందుకు ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య భాగస్వామ్యానికి ఇరు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి. ఆహార భద్రత విషయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు యూఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు.

అమరావతిపై యూఏఈ ఆసక్తి
అనంతరం యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ జియౌదితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, పెట్రో కెమికల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించారు. ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టే అంశంపై మంత్రి థానీ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.

వివిధ రంగాల దిగ్గజాలతో సమావేశాలు
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు ప్రముఖ కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. దుబాయ్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ (VARA) ఎండీ దీపా రాజా కార్బన్‌తో భేటీ అయి డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌, బ్లాక్‌చైన్‌ వంటి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. క్రౌన్ ఎల్ఎన్జీ సీఈఓ స్వపన్ కటారియాతో ఎల్‌ఎన్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల గురించి, ట్రైస్టార్ గ్రూప్ సీఈఓ యూజిన్ మేయిన్‌తో లాజిస్టిక్స్, సప్లై చైన్ రంగాల్లో అవకాశాల గురించి వివరించారు.

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆస్టర్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజాద్ మూపెన్‌కు తెలిపారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు స్థాపించాలని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా, టెక్స్‌టైల్‌, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల కోసం అపారెల్ గ్రూప్ సీఈఓ నీలేశ్ వేద్‌తో చర్చించారు. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
UAE
Investments
Amaravati
Trade Relations
Artificial Intelligence
Renewable Energy
Food Processing
Logistics

More Telugu News