Telangana Drugs Control Administration: దేహదారుఢ్యం కోసం ప్రాణాంతక ఇంజెక్షన్ నిల్వలు.. జిమ్‌లలో ఆకస్మిక తనిఖీలు

Telangana Drugs Control Administration raids Hyderabad gyms for illegal injections
  • అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ సిఫార్సు చేస్తున్న పలు జిమ్‌ల యజమానులు
  • నగరంలోని 20 జిమ్‌లలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు
  • సికింద్రాబాద్, మెహదీపట్నం, మలక్‌పేట, పంజాగుట్ట, సూరారంలలో తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని పలు జిమ్‌లలో ప్రాణాంతక ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కండలు పెరుగుతాయని పలు జిమ్‌ల యజమానులు అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్, కార్డియాక్ అరెస్టులకు దారి తీసే మెఫెంటెర్మిన్ సల్ఫేట్‌ను జిమ్‌కు వచ్చే వారికి సూచిస్తున్నారు. అయితే ఇవి ప్రాణాంతక ఇంజెక్షన్లని అధికారులు గుర్తించారు.

అక్రమంగా నిల్వ చేసిన ఈ ప్రాణాంతక ఇంజెక్షన్ల కోసం నగరంలోని పలు జిమ్‌లలో అధికారులు సోదాలు నిర్వహించారు. దేహదారుఢ్యం కోసం అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్, మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వంటివి ఉపయోగిస్తే హృదయ సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుందని, కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని హైదరాబాద్ నగరంలోని 20 జిమ్‌లలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అకస్మిక తనిఖీలు నిర్వహించింది. సికింద్రాబాద్, మెహదీపట్నం, టోలీచౌకి, మలక్‌పేట, నార్సింగి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొత్తపేట, కూకట్‌పల్లి, సూరారంలలోని జిమ్‌లలో తనిఖీలు నిర్వహించినట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం తెలిపారు.

గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసే సమయంలో అనస్థిషియా ఇవ్వడం వల్ల రోగులకు రక్తపోటు తగ్గుతుంది. ఆ సమయంలో బీపీని పెంచడానికి మెఫెంటెర్మైన్ సల్ఫేట్‌ను వినియోగిస్తారు. ఈ ఔషధం ఎంత మోతాదులో ఉండాలనేది కేవలం వైద్యుడు మాత్రమే నిర్ణయించాలి. అయితే జిమ్ నిర్వాహకులు దీనిని దుర్వినియోగం చేస్తూ, అక్కడకు వచ్చే వారికి సూచిస్తున్నారు.

జిమ్ నిర్వాహకులు ఇలాంటి మందులను నిల్వ చేయడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం. డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు. డీసీఏ ప్రకారం, అనబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లను దుర్వినియోగం చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కండరాల పెరుగుదలకు దీనిని వినియోగిస్తే ఆ తర్వాత హృదయ సంబంధ సమస్యలు, కాలేయం దెబ్బతినడం, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు, హార్మోన్ల అసమతుల్యత వంటి ప్రతికూల ప్రభావాలకు దారి తీయవచ్చు. ఇలాంటి అక్రమ నిల్వలు ఉండరాదని జిమ్ నిర్వాహకులు, సిబ్బందికి డీసీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని షాన్‌వాజ్ ఖాసీం తెలిపారు.
Telangana Drugs Control Administration
Hyderabad gyms
anabolic steroids
mephentermine sulfate

More Telugu News