Piyush Goyal: సుంకాలపై ట్రంప్ బెదిరింపులు.. పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Piyush Goyal responds to Trump tariff threats
  • భారతదేశం ఎవరికీ తలొగ్గదని, హడావుడి నిర్ణయాలు తీసుకోదన్న గోయల్
  • అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్న కేంద్ర మంత్రి
  • మరిన్ని సుంకాలు వేస్తామంటే కొత్త మార్కెట్లను వెతుక్కుంటామని హెచ్చరిక
అమెరికా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరికీ తలొగ్గదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ అనేక వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందని అన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో, 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో మార్పు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని, ఇతర దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకుంటున్నామని తెలిపారు.

దీని ద్వారా సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. భారత్ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని, కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్‌పై ఉన్న సుంకాలను అంగీకరిస్తున్నామని, అలాగని మరిన్ని సుంకాలు వేస్తామనే బెదిరింపు ధోరణిని అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను అన్వేషిస్తామని వ్యాఖ్యానించారు.
Piyush Goyal
India US trade deal
trade agreements
US tariffs
India trade policy
Berlin
commerce ministry

More Telugu News