Gopal Badne: పోలీస్ అధికారి అత్యాచారం... అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

Maharashtra Doctor Suicide Note Blames Police Officer Gopal Badne
  • మహారాష్ట్రలో ఎస్సై లైంగిక వేధింపులతో మహిళా డాక్టర్ ఆత్మహత్య
  • అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం
  • ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపణ
  • జూన్‌లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • ప్రభుత్వంపై విపక్షాల తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్ర లైంగిక వేధింపులు ఎదురవడంతో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు కారణమైన ఎస్సై పేరును అరచేతిపై సూసైడ్ నోట్‌గా రాసి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. సతారా జిల్లా ఆసుపత్రిలో గురువారం రాత్రి ఈ విషాదం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

వివరాల్లోకి వెళితే, ఫల్టాన్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలిపై పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) గోపాల్ బద్నే గత ఐదు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తనపై నాలుగు సార్లు అత్యాచారం చేయడంతో పాటు, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని ఆమె తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. "నా చావుకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బద్నే కారణం. అతడు నాపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడు" అని ఆమె అరచేతిపై రాసుకున్నారు. ఈ నోట్‌లో ప్రశాంత్ బంకర్ అనే మరో అధికారి కూడా మానసికంగా వేధించాడని పేర్కొన్నారు.

అయితే, ఈ వేధింపులపై బాధితురాలు ఈ ఏడాది జూన్ 19నే ఫల్టాన్ డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎస్సై బద్నేతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారుల పేర్లను ఆమె తన లేఖలో ప్రస్తావించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, అప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు నిందితుడైన ఎస్సై గోపాల్ బద్నేను సస్పెండ్ చేశారు.

ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. "రక్షకులే భక్షకులైతే ఎలా? పోలీసులు ఒక మహిళా డాక్టర్‌నే వేధిస్తుంటే ఇక న్యాయం ఎలా జరుగుతుంది? ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులపై కేవలం విచారణ కాకుండా, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై అధికార పక్షం కూడా స్పందించింది. ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ హామీ ఇచ్చారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సహాయం కోసం 112 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆమె కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్సీపీ నేత ఆనంద్ పరంజపే తెలిపారు.

మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. గతంలో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సతారా ఎస్పీని ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Gopal Badne
Maharashtra
Satara
police officer
suicide
doctor
sexual assault
harassment
police investigation
Devendra Fadnavis

More Telugu News