DK Shivakumar: ఏపీలో ఘోర బస్సు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డిమాండ్

DK Shivakumar Demands High Level Probe into AP Bus Tragedy
  • కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి
  • ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే డిమాండ్
  • ఇది నిర్లక్ష్యం లేదా కుట్ర అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన శివకుమార్
  • గతవారం ఇలాంటి ఘటనే జరిగినా చర్యలు తీసుకోలేదని ఆరోపణ
కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. 19 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీని వెనుక కుట్ర లేదా నిర్లక్ష్యం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

బెంగళూరులోని విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్, ఈ ఘటనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "గతవారం కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే దగ్ధమైంది. నేను ఇటీవల రాయచూర్‌కు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు నాకు ఆ వీడియో చూపించారు. ఆ బస్సులో మంటలు రాగానే మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు డ్రైవర్‌ను పట్టుకుని గట్టిగా అరిచి హెచ్చరించడంతో ప్రయాణికులందరూ వెంటనే కిందికి దిగిపోయారు. ఆ బస్సులో సుమారు 20 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు, స్వల్ప గాయాలతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారి ల్యాప్‌టాప్‌లు మాత్రం కాలిపోయాయి" అని ఆయన గుర్తుచేశారు.

అంత పెద్ద ఘటన జరిగినా అధికారులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని, పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తాజా ప్రమాదానికి గురైన బస్సు ఆపరేటర్ బెంగళూరుకు చెందిన వ్యక్తి కావడంతో, ఈ విషయంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, హోం మంత్రి జి.పరమేశ్వరను ఆదేశించినట్లు శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తాజా దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వేణు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. "నేను, మరికొంతమంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ అద్దాన్ని పగలగొట్టి బయటకు దూకేశాం. కానీ, మా కళ్లెదుటే ఎంతోమంది మంటల్లో చిక్కుకుని చనిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

సోదరిని చూసి తిరిగి బెంగళూరు వస్తుండగా L-13 సీటులో ప్రయాణిస్తున్నానని వేణు తెలిపారు. "తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ఆగింది. మళ్లీ కదలడం మొదలైన కాసేపటికే ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. ఊపిరి ఆడలేదు. ఓ ప్రయాణికుడు తన చేతితో అద్దాన్ని పగలగొట్టాడు. అతనికి గాయమైనా, సుమారు 15 మంది బయటకు రావడానికి సాయం చేశాడు. బస్సు మొదట ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఐదు మీటర్ల దూరంలో నిలబడి తోటి ప్రయాణికులు కాలిపోవడాన్ని చూడాల్సి వచ్చింది. గంట తర్వాత మరో బస్సులో బెంగళూరు చేరుకున్నాను" అని వేణు వివరించారు. 
DK Shivakumar
Andhra Pradesh bus accident
Karnataka Deputy CM
Kurnool bus fire
bus accident investigation
private bus fire
road safety
Venu Bangalore
Ramalinga Reddy
G Parameshwara

More Telugu News