Byreddy Shabari: బస్సు ప్రమాదం నుంచి 19 మందిని కాపాడాం: ఎంపీ శబరి

Byreddy Shabari Rescued 19 from Kurnool Bus Accident
  • కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
  • ఫ్యూయల్ ట్యాంక్‌ను బైక్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
  • పలువురు సజీవ దహనం.. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితి
  • ఘటనా స్థలంలో ఎంపీ బైరెడ్డి శబరి.. వివరాలు వెల్లడి
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకోవడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఎదురుగా వస్తున్న ఓ బైక్.. బస్సు ఫ్యూయల్ ట్యాంక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె ప్రమాద వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇంధన ట్యాంక్‌ను బైక్ ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని, బస్సు 'బాంబులా పేలినట్లు' ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారని ఆమె వివరించారు.

ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. అప్రమత్తమైన కొందరు వెంటనే బస్సు కిటికీల అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మొత్తం 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని ఎంపీ శబరి చెప్పారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలు, మరికొందరికి ఫ్రాక్చర్లు అయ్యాయని, అయితే ఎవరి పరిస్థితీ విషమంగా లేదని ఆమె స్పష్టం చేశారు.

దురదృష్టవశాత్తు, మిగిలిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గంట, గంటన్నర వ్యవధిలో విచారణ పూర్తి చేసి, మృతుల వివరాలను వెల్లడిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ గారు వెంటనే స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించారని బైరెడ్డి శబరి తెలిపారు.
Byreddy Shabari
Kurnool bus accident
Andhra Pradesh bus fire
Vemuri Kaveri Travels
Chinnatekuru accident
Bus accident rescue
Road accident India
Chandrababu Naidu
Lokesh Nara

More Telugu News