Jayaprakash Narayana: ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి: జేపీ

Jayaprakash Narayana Recalls a Heart Touching Incident That Deeply Moved Him
  • భార్య కన్నా మామగారినే ఎక్కువ ప్రేమించానన్న జేపీ
  • ఉద్యోగంలో చేరిన కొత్తలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న వైనం
  • ఓ పేదరాలి కన్నీళ్లే తనను ఎంతగానో కదిలించాయని వెల్లడి
  • దేశంలో విద్య కోసం కోట్ల మంది తల్లిదండ్రుల ఆవేదన అదేనని వ్యాఖ్య
  • నా భార్య, పిల్లల సహకారం ఎంతో గొప్పది: జేపీ
లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తన జీవితంలో జరిగిన ఓ సున్నితమైన, తనను ఎంతగానో ప్రభావితం చేసిన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన ఉద్యోగ జీవితం తొలినాళ్లలో ఓ నిరుపేద మహిళ తన మనవడి చదువు కోసం పడిన ఆవేదన తనను తీవ్రంగా కదిలించిందని, ఆ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న జేపీ, ఆ సంఘటన గురించి వివరిస్తూ.. "అది 1983-84 మధ్యకాలం, నాకు పెళ్లైన కొత్త రోజులు. నేను సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు 50 ఏళ్ల వయసున్న ఓ పేద మహిళ, ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బందిగా పనిచేసేది. కొడుకు చనిపోవడంతో మనవడిని తనే పెంచుకుంటోంది. వాడిని ఓ ప్రైవేట్ మిషన్ స్కూల్‌లో చేర్పించాలని ప్రయత్నించింది, కానీ సీటు దొరకలేదు. ఆమె నా దగ్గరికి వచ్చి, ఫీజు కూడా కడతానని చెబుతూ నా కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చింది. ఈ దేశంలో ఓ నిరుపేద కుటుంబం తమ పిల్లల చదువు కోసం కన్నీళ్లు పెట్టుకుని కాళ్ల మీద పడే దుస్థితి ఉందంటే, సమాజంగా మనం సిగ్గుపడాలి. ఆ ఒక్క వ్యక్తి సమస్య కాదు, ఈ దేశంలో కోట్ల మంది తల్లిదండ్రుల విషాదం అదే" అని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య కన్నా మామగారినే ఎక్కువ ప్రేమించాను
తన వివాహం, కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ, "నేను నిజంగా ప్రేమించింది మా మామగారిని. ఆయన చాలా గొప్ప వ్యక్తి, గాంధేయవాది. ఆయన వ్యక్తిత్వం చూసే నాకు తమ కుమార్తెను ఇచ్చారు. పెళ్లికి ముందే నా భార్యతో చెప్పాను. నేను ఐఏఎస్ అధికారిగా ఎక్కువ కాలం ఉండను, దేశంలో మార్పు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశాను. ఆమె అంగీకరించింది" అని తెలిపారు. భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని, ముఖ్యంగా మహిళలు కుటుంబ భారాన్ని మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, తన భార్య, పిల్లల సహకారం కూడా అలాంటిదేనని జేపీ అన్నారు.

తన పిల్లల గురించి చెబుతూ, అబ్బాయి ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నాడని, అమ్మాయి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, తాజాగా అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (రెసిడెన్సీ)కి ఎంపికైందని సంతోషం వ్యక్తం చేశారు.

సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలపై తన అభిరుచిని పంచుకుంటూ, "ఒకప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. కానీ ఇప్పుడు చాలా అరుదుగా చూస్తున్నా. కొత్త సినిమాల్లోని పాటల సాహిత్యం ఒక్క చరణం కూడా అర్థం కావట్లేదు. నాకు హాస్యం అంటే ప్రాణం. హాస్యం ఉంటే తప్పకుండా చూస్తాను. ఇటీవలే థియేటర్‌లో చూసిన సినిమా ఆర్టికల్ 370" అని జేపీ వివరించారు. నటన వైపు వెళ్లే ఆలోచన ఎప్పుడూ రాలేదని, తాను లాజిక్‌తో ఆలోచించే బోరింగ్ పర్సన్‌ని అని, నటనకు కావాల్సిన సృజన, హృదయం ప్రధానమైన స్పందన తనలో లేవని ఆయన వ్యాఖ్యానించారు.
Jayaprakash Narayana
JP

More Telugu News