Sudheesh Prem Kumar: తరగతి గదిలో పాఠాలు వింటూనే బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి

Sudheesh Prem Kumar Brain Dead While Attending Class in Hanmakonda
  • హనుమకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విషాద ఘటన
  • తరగతి గదిలో కుప్పకూలిన నాలుగో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్
  • పరీక్షించిన వైద్యులు బాలుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడి
  • ప్రస్తుతం వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స
  • పాఠశాల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విద్యార్థి సంఘాల ఆందోళన
  • ఘటనపై విద్యాశాఖ అధికారి విచారణ ప్రారంభం
చదువుల ఒడిలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పాఠం వింటున్న ఓ తొమ్మిదేళ్ల విద్యార్థి ఉన్నట్టుండి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.

బానోతు సుదీష్ ప్రేమ్ కుమార్ (9) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే గురువారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి, తరగతి గదిలో పాఠం వింటుండగా అకస్మాత్తుగా బెంచీపై తల వాల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, యాజమాన్యం బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, బాలుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు తేల్చారు. గుండె కొట్టుకుంటుండటంతో ప్రస్తుతం అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఉదయం ఆరోగ్యంగా పాఠశాలకు పంపిన తమ కుమారుడు ఇలాంటి స్థితికి చేరుకోవడాన్ని ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రులు రమేశ్, సుజాత జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠశాల యాజమాన్యం సరైన సమయంలో స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు శ్వాస సరిగా అందకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని వైద్యులు తమకు వివరించినట్లు వారు తెలిపారు.

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగాయి. నెలన్నర క్రితం ఇదే పాఠశాలలో మరో విద్యార్థి మరణించాడని, వరుస ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి పాఠశాలను సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Sudheesh Prem Kumar
Hanmakonda
Brain dead
School student
Private school
Classroom death
Telangana
Education
Student protest
School negligence

More Telugu News