H-1B Visa: భారత ఐటీ నిపుణులకు షాక్: హెచ్-1బీ ఫీజుపై వెనక్కి తగ్గని అమెరికా

US Defends H 1B Visa Fee Hike
  • H-1B వీసా ఫీజుపై దావాలను కోర్టులో ఎదుర్కొంటామన్న ట్రంప్ ప్రభుత్వం
  • అమెరికన్ల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన వైట్ హౌస్
  • లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమంటూ కోర్టుకెక్కిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H-1B వీసాలపై కొత్తగా విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజు విధానాన్ని కోర్టులో సమర్థించుకుంటామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విధానం అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికేనని వైట్ హౌస్ ఉద్ఘాటించింది.

వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, H-1B వీసా వ్యవస్థలో మోసాలు పెరిగిపోయాయని, దీనివల్ల అమెరికన్ల వేతనాలు పడిపోతున్నాయని ఆరోపించారు. "అధ్యక్షుడి మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ అమెరికన్ కార్మికులకే. వీసా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఏళ్ల తరబడి H-1B వీసాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే అధ్యక్షుడు కొత్త విధానాలను తీసుకొచ్చారు. మా చర్యలు చట్టబద్ధమైనవి, అవసరమైనవి. ఈ విషయంలో కోర్టులో పోరాటం కొనసాగిస్తాం" అని ఆమె అన్నారు.

ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (CoC) సహా పలు కార్మిక, మత, విద్యా సంస్థలు కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులలో దావాలు వేశాయి. ఈ లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని ఆరోపించాయి. వీసా జారీకి అయ్యే ఖర్చుల ఆధారంగానే ఫీజులు ఉండాలన్న 'ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్' నిబంధనలను ఈ కొత్త విధానం ఉల్లంఘిస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన వ్యాజ్యంలో పేర్కొంది.

ఈ కొత్త ఫీజు వల్ల అమెరికాలోని స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని యూఎస్ ఛాంబర్ చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునేందుకు కాంగ్రెస్ H-1B కార్యక్రమాన్ని సృష్టించింది. కానీ లక్ష డాలర్ల ఫీజు వల్ల కంపెనీలకు ఇది భరించలేని భారంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి అవరోధంగా నిలుస్తుంది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం కొన్ని వేల డాలర్లుగా ఉన్న H-1B ప్రాసెసింగ్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు ట్రంప్ సర్కార్ పెంచడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు, ముఖ్యంగా H-1B వీసాలపై అత్యధికంగా ఆధారపడే భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.
H-1B Visa
US H-1B Visa
H-1B Fee
Trump Administration
Indian IT Professionals
US Chamber of Commerce
Immigration and Nationality Act
American Workers
US Economy
Caroline Levitt

More Telugu News