Spirit Movie: కేవలం ఆడియోతోనే అదరగొట్టారు... 'స్పిరిట్' గ్లింప్స్ వచ్చేసింది!

Prabhas Spirit Glimpse Released with Audio Only
  • ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా 'స్పిరిట్' సౌండ్ స్టోరీ విడుదల
  • ఆడియో రూపంలోనే ఆకట్టుకున్న 1 నిమిషం 31 సెకన్ల గ్లింప్స్
  • హైలైట్‌గా నిలిచిన ప్రభాస్ పవర్‌ఫుల్ డైలాగ్
  • షూటింగ్‌కు ముందే 70 శాతం సౌండ్‌ట్రాక్ సిద్ధం చేస్తున్న సందీప్ వంగా
  • భారతీయ సినిమాలో ఇదొక సరికొత్త ప్రయోగమంటున్న విశ్లేషకులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం రాత్రి చిత్ర బృందం ‘ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్’ పేరుతో ఒక ప్రత్యేకమైన గ్లింప్స్‌ను విడుదల చేసింది. విజువల్స్ లేకుండా కేవలం ఆడియోతోనే సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటిచింది ఈ గ్లింప్స్‌.

1 నిమిషం 31 సెకన్ల నిడివి ఉన్న ఈ సౌండ్ గ్లింప్స్‌లో, ఒక ఐపీఎస్ అధికారి అయిన ప్రభాస్‌ను అరెస్ట్ చేస్తున్న సన్నివేశాన్ని కేవలం సంభాషణలు, శబ్దాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. "వీడి గురించి విన్నాను… యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు… చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో!" అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే వాయిస్ ఓవర్, సందీప్ వంగా మార్క్ రైటింగ్‌ను గుర్తుచేసింది.

ఇక ఈ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్. "మిస్టర్ సూపరింటెండెంట్… నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది…" అంటూ ఆయన చెప్పిన ఒక్క డైలాగ్‌తోనే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత తీవ్రంగా, మొరటుగా ఉండబోతుందో స్పష్టమైంది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా సౌండ్ డిజైన్‌పై మాట్లాడిన చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేపథ్య సంగీతం అందిస్తారు. కానీ 'స్పిరిట్' కోసం మేం షూటింగ్‌కు ముందే 70 శాతం సౌండ్‌ట్రాక్‌ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ఆధారంగానే షాట్లను చిత్రీకరించబోతున్నాం" అని తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఇదొక అరుదైన ప్రయోగమని సినీ వర్గాలు అంటున్నాయి.

టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో వివేక్ ఒబెరాయ్, త్రిప్తి దిమ్రీ, ప్రకాశ్ రాజ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక‌, ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితోపాటు త్వరలోనే ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Spirit Movie
Prabhas
Sandeep Reddy Vanga
Prabhas Spirit
Prabhas IPS officer
Prakash Raj
T-Series
Bhadrakali Pictures
Telugu cinema
Pan India movie

More Telugu News