Carbide Gun: వెలుగుల పండుగ నాడు 14 మంది చిన్నారుల జీవితాల్లో చీకట్లు!

Carbide Gun Havoc in Madhya Pradesh Blinds 14 Children
  • మధ్యప్రదేశ్‌లో దీపావళి నాడు తీవ్ర విషాదం
  • కార్బైడ్ గన్ పేలుళ్లలో 122 మంది పిల్లలకు గాయాలు
  • 14 మంది చిన్నారులకు శాశ్వతంగా పోయిన కంటిచూపు
  • నిషేధం ఉన్నా యథేచ్ఛగా సాగిన అమ్మకాలు
  • విదిశ జిల్లాలో అత్యధికంగా నమోదైన కేసులు
వెలుగుల పండుగ దీపావళి మధ్యప్రదేశ్‌లోని అనేక కుటుంబాల్లో చీకట్లను నింపింది. పండుగ సంబరాల్లో భాగంగా పిల్లలు కాల్చిన ప్రమాదకరమైన కార్బైడ్ గన్‌లు పేలడంతో కేవలం మూడు రోజుల్లో 122 మంది చిన్నారులు తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో 14 మంది చిన్నారులు శాశ్వతంగా తమ కంటిచూపును కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది.

బాధితుల్లో ఎక్కువ మంది విదిశ జిల్లాకు చెందినవారే కాగా, భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ వంటి నగరాల్లోనూ ఇలాంటి కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూశాయి. ప్లాస్టిక్ పైపులతో చేతితో తయారుచేసే ఈ కార్బైడ్ గన్‌లలో కాల్షియం కార్బైడ్ లేదా గన్‌పౌడర్ వేసి పేలుస్తారు. ఇది బాంబులా భారీ శబ్దం చేయడంతో పిల్లలు దీనిపై ఎక్కువ మోజు పెంచుకున్నారు. కేవలం రూ. 150 నుంచి రూ. 200కే లభించడం, సులభంగా తయారుచేసుకోగలగడంతో వీటి వాడకం విపరీతంగా పెరిగింది.

అయితే, ఈ గన్‌ల వల్ల ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 18నే వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. అయినప్పటికీ, నిషేధాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా వీటిని అక్రమంగా విక్రయించారు. ఈ తుపాకులను పేల్చినప్పుడు ఒక్కోసారి రసాయన రేణువులు, నిప్పురవ్వలు నేరుగా ముఖంపైకి చిమ్ముతాయి. ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో చాలామంది పాక్షికంగా చూపు కోల్పోయారని వైద్యులు తెలిపారు.

"కార్బైడ్ గన్ వల్ల నా ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. ఇక ఆ కన్నుతో నేను చూడలేను" అని 17 ఏళ్ల నేహా అనే బాలిక కన్నీటిపర్యంతమైంది. "సోషల్ మీడియాలో చూసి నేనే స్వయంగా గన్ తయారుచేసి పేల్చాను. అది ముఖం మీదే పేలడంతో ఒక కన్ను పూర్తిగా పోయింది" అని రాజ్ విశ్వకర్మ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, కార్బైడ్ గన్‌లను తయారుచేసి అమ్ముతున్న ఆరుగురిని విదిశ జిల్లాలో అరెస్టు చేశారు. ఇది బొమ్మ తుపాకీ కాదని, కంటి రెటీనాను పూర్తిగా నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థమని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Carbide Gun
Madhya Pradesh
Diwali
Children
Eye Injuries
Carbide Gun Ban
India
Accidents
Vidisha
Gunpowder

More Telugu News