Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం.. 20 మందికి పైగా మృతి!

Kurnool bus accident 25 killed in Andhra Pradesh
  • కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండ‌గా ఘటన
  • స్కూటర్‌ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
  • ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం
  • అత్యవసర ద్వారం పగలగొట్టి బయటపడిన 12 మంది
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై, బూడిదైపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 41 మంది వ‌ర‌కు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రయాణికుల్లో చాలామంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై, అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా, వారికి కూడా గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్ర‌యాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం నుంచి బయటపడినవారు..
సత్యనారాయణ- సత్తుపల్లి
జైసూర్య- మియాపూర్‌
నవీన్‌కుమార్‌- హయత్‌నగర్‌
సరస్వతి హారిక- బెంగళూరు
నేలకుర్తి రమేశ్‌- నెల్లూరు
కటారి అశోక్‌- రంగారెడ్డి జిల్లా
ముసునూరి శ్రీహర్ష- నెల్లూరు
పూనుపట్టి కీర్తి- హైదరాబాద్‌
వేణుగోపాల్‌రెడ్డి- హిందూపురం
రామిరెడ్డి- ఈస్ట్‌ గోదావరి
లక్ష్మయ్య, శివనారాయణ (డ్రైవర్లు)
Kurnool Bus Accident
Kurnool district
bus accident
private bus fire
Andhra Pradesh accident
Hyderabad bus
Kaveri Travels
bus fire accident
road accident
fatal accident

More Telugu News