Ponguleti Srinivas Reddy: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం అప్ డేట్

Ponguleti Srinivas Reddy Reveals Telangana Local Body Election Decision
  • స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు తర్వాతే ప్రభుత్వ నిర్ణయం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
  • వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నొక్కిచెప్పారు. ఈ అంశంపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు. "ఉన్నత న్యాయస్థానం నుంచి తీర్పు రాగానే, కేబినెట్‌లో చర్చించి స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ క్రమంలో నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం అవుతుంది" అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

ఈ సమావేశంలో కేవలం ఎన్నికల అంశమే కాకుండా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో పాటు, 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాతబడిన రామగుండం థర్మల్ ప్లాంట్‌ను కూల్చివేయాలని కూడా నిర్ణయించింది.

నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల సమస్యపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని విమర్శించారు. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు 44 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. "ఈ టన్నెల్ నిర్మాణాన్ని పాత పద్ధతిలో కాకుండా, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం" అని ఆయన పేర్కొన్నారు.
Ponguleti Srinivas Reddy
Telangana local body elections
BC reservations
Telangana cabinet meeting
High court verdict
Super specialty hospitals
Battery power storage plant
Ramagundam thermal plant
Nalgonda fluoride victims
Srisailam tunnel project

More Telugu News