YS Sharmila: ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన షర్మిల

YS Sharmila Criticizes AP Government Over Aarogyasri Services Halt
  • ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
  • రూ. 2,700 కోట్ల బకాయిలే కారణమన్న షర్మిల
  • 15 రోజులుగా రోగుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ. 2,700 కోట్ల బకాయిలు పెట్టడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అని గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గత 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అత్యవసర సర్జరీలు సైతం ఆగిపోయి పేదలు నరకయాతన అనుభవిస్తున్నా, కూటమి ప్రభుత్వానికి మనసు కరగడం లేదని విమర్శించారు. చేసిన వైద్యానికి బిల్లులు చెల్లించాలంటూ ఆసుపత్రులు రోడ్డెక్కడం అత్యంత విచారకరమని అన్నారు.

రాష్ట్రంలో ఇంత పెద్ద సంక్షోభం నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉండటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని షర్మిల దుయ్యబట్టారు. వైద్యం అందక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం దారుణమని మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, పూర్తిగా చంపేసే కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు.
YS Sharmila
Andhra Pradesh
Aarogyasri
Chandrababu Naidu
AP Government
Health Scheme
Private Hospitals
Medical Services
Congress Party
Healthcare Crisis

More Telugu News