KCR: కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్ కు టికెట్ ఇచ్చింది.. చిత్తుగా ఓడించండి: కేసీఆర్

KCR slams Congress for giving ticket to rowdy sheeter in Jubilee Hills
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
  • హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు ఈ ఎన్నిక ఒక పరీక్ష అని వ్యాఖ్య
  • ఈ ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని జోస్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని తీవ్రంగా ఆరోపించిన ఆయన, విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు అతడిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక హైదరాబాద్ నగర ప్రజల తెలివితేటలకు, విజ్ఞతకు ఒక కఠిన పరీక్షగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. "కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గుల్లగా మారింది. శాంతిభద్రతలకు మారుపేరైన హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. మా పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ వచ్చాక కనుమరుగయ్యాయి" అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ దుష్టపాలన గురించి ప్రజలకు మరింతగా వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ ఉప ఎన్నిక ఫలితం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. "జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే, ఆ గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారనే సంకేతాలు వెళతాయి. ఈ ఉప ఎన్నికలో మన విజయం ఖాయం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. 
KCR
K Chandrashekar Rao
BRS
Jubilee Hills by election
Telangana politics
Congress party
Naveen Yadav
GHMC elections
Maganti Sunitha
Telangana

More Telugu News