Nandamuri Balakrishna: బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు.. అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్!

YS Jagan Alleges Balakrishna Attended Assembly Drunk
  • అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన జగన్
  • బాలకృష్ణ తాగి మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు
  • ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయని వ్యాఖ్య
  • తాగి మాట్లాడే వ్యక్తిని ఎలా అనుమతిస్తారని ప్రశ్న 
  • అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదంటూ తీవ్ర విమర్శలు
మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదు" అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా, "బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి" అని వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో చర్చను ప్రారంభించారు. దానిని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ... జగన్, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

అయితే, బాలకృష్ణ తన ప్రస్తావన తీసుకురావడంపై నటుడు చిరంజీవి అప్పట్లోనే ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి అవమానం జరగలేదని, అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఎంతో గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Nandamuri Balakrishna
YS Jagan
AP Assembly
TDP
YSRCP
Chiranjeevi
Kamineni Srinivas
Andhra Pradesh Politics
Assembly sessions
alcohol allegations

More Telugu News