Nara Lokesh: ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం.. టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు

Nara Lokesh Discusses Key Proposals with University of Tasmania
  • ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు
  • గ్రామీణ ఆరోగ్యం, తాగునీటిపై ఉమ్మడి పరిశోధనలకు ప్రతిపాదన
  • ఏపీ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ప్లేస్‌మెంట్ కోసం ప్రత్యేక స్కిల్ ప్రోగ్రామ్స్
  • విశాఖలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని బుపా సంస్థకు లోకేశ్ ఆహ్వానం
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన బుపా యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసీ, పారామెడికల్ విద్యారంగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ఆస్ట్రేలియా పర్యటనలో కీలక అడుగులు వేశారు. మెల్‌బోర్న్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా (UTAS) ప్రతినిధులతో ఆయన సమావేశమై, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.

టాస్మానియా యూనివర్సిటీని సందర్శించిన మంత్రి లోకేశ్ కు, యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (అకడమిక్) ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, ఫార్మసీ విభాగ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల పాఠ్య ప్రణాళికలను ప్రపంచస్థాయికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. 

ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న కఠినమైన అక్రిడిటేషన్ వ్యవస్థల తరహాలో ఏపీలో కూడా కరికులం రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు. శిక్షణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెలిమెడిసిన్ వంటి ఆధునిక డిజిటల్ హెల్త్ టూల్స్‌ను అనుసంధానించాలని సూచించారు. ఏపీలోని వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీకి ఉన్న ఫార్మా, హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను పరిచయం చేసి, పరిశ్రమలతో భాగస్వామ్యాలు కుదిరేలా చూడాలని కోరారు.

అంతేకాకుండా, ఏపీలోని గిరిజన ప్రాంతాలు, టాస్మానియాలోని మారుమూల కమ్యూనిటీలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని లోకేశ్ ప్రతిపాదించారు. ఏపీలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకుల కోసం స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని ఉద్యోగ అర్హతలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులకు ప్రత్యేక స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు అందించాలని, తద్వారా వారి ప్లేస్‌మెంట్ అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.

ఈ ప్రతిపాదనలపై ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోని టాప్ 2 శాతం యూనివర్సిటీలలో తమది ఒకటని, ఇప్పటికే తమ వర్సిటీలో 1,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఐఐటీలతో కలిసి రెన్యువబుల్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నామని, కేరళ వంటి రాష్ట్రాలతో నర్సింగ్ విద్యకు సంబంధించి ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు. లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలించి, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

విశాఖలో గ్లోబల్ సెంటర్‌కు బుపాకు ఆహ్వానం
పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్, బ్రిటీష్ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ, బీమా సంస్థ అయిన బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్‌తో కూడా సమావేశమయ్యారు. ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని లోకేశ్ కోరారు. 

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన బిజల్ సెజ్ పాల్, తమ సంస్థ 190 దేశాల్లో 38 మిలియన్ల వినియోగదారులతో పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
University of Tasmania
AP health education
skill development
Bupa
Visakhapatnam
digital health
pharmacy
paramedical

More Telugu News