Rohit Sharma: నన్ను మాత్రం అనొద్దు... రోహిత్, శ్రేయస్ అయ్యర్ మధ్య ఆసక్తికర సంభాషణ

Rohit Sharma Shreyas Iyer Funny Conversation During ODI Match
  • ఆసీస్‌తో రెండో వన్డే
  • ఓ సింగిల్ తీసే బాధ్యత ఎవరిదనే దానిపై లో రోహిత్, శ్రేయస్ మధ్య చర్చ
  • స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయిన ఆసక్తికర సంభాషణ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సింగిల్ తీసే విషయంలో ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి చర్చ స్టంప్ మైక్‌లో రికార్డు కావడంతో ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. వీరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్నింగ్స్ సమయంలో ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని రోహిత్ నెమ్మదిగా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శ్రేయస్ వద్దనడంతో రోహిత్ వెనక్కి వచ్చేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన రోహిత్, "శ్రేయస్, అది కచ్చితంగా సింగిల్" అని అన్నాడు. అందుకు శ్రేయస్ బదులిస్తూ, "రన్ కు రావాలో, వద్దో నువ్వే నిర్ణయం తీసుకో.. ఆ తర్వాత నన్ను మాత్రం అనొద్దు" అని స్పష్టం చేశాడు.

ఈ చర్చ ఇక్కడితో ఆగలేదు. "నువ్వే కాల్ ఇవ్వాలి. అతను (బౌలర్) ఇప్పటికే ఏడో ఓవర్ వేస్తున్నాడు (అలసిపోయి ఉంటాడు)" అని రోహిత్ సూచించాడు. దానికి శ్రేయస్, "నాకు అతని యాంగిల్ తెలియడం లేదు. నువ్వే కాల్ ఇవ్వొచ్చు కదా!" అని సమాధానమిచ్చాడు. "ఆ కాల్ నేను ఇవ్వలేను" అని రోహిత్ చెప్పగా, "బౌలర్ నీ ఎదురుగానే కదా ఉన్నాడు" అంటూ శ్రేయస్ ఈ సంభాషణను ముగించాడు.

ఈ సంభాషణపై కామెంటేటర్లు ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించారు. "ఇలాంటి పరుగుల విషయంలో నాన్-స్ట్రైకర్ దే తుది నిర్ణయం. అక్కడ పరుగు లేదని శ్రేయస్ బలంగా నమ్మాడు" అని చోప్రా విశ్లేషించాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, "అనుభవం ఇక్కడే కనిపిస్తుంది. బౌలర్ వరుసగా ఏడు ఓవర్లు వేసి అలసిపోయి ఉంటాడు. అక్కడ సులభంగా సింగిల్ తీసి ఉండాల్సింది" అని అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 17 పరుగులకే గిల్, కోహ్లీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రోహిత్ శర్మ (97 బంతుల్లో 73), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61) బాధ్యతాయుతంగా ఆడి మూడో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా (24) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
Rohit Sharma
Shreyas Iyer
India vs Australia
ODI Match
Cricket
Cricket News
Axar Patel
Harshit Rana
Cricket conversation
Stump mic

More Telugu News