AB Venkateswara Rao: విద్యుత్ చార్జీల మోతకు కారణమదే.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు

AB Venkateswara Rao Alleges Corruption Behind Electricity Charges
  • ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వల్లే విద్యుత్ చార్జీల భార‌మ‌న్న ఏబీవీ
  • వైసీపీ పాలనలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందని వ్యాఖ్య‌
  • ప్రస్తుత సీఎండీకి ఫిర్యాదు చేసిన మాజీ ఇంటెలిజెన్స్ డీజీ
  • ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టారని ఆరోపణ
  • రేపు తిరుపతిలో అఖిలపక్షంతో రౌండ్ టేబుల్ సమావేశం
గత ప్రభుత్వ హయాంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో జరిగిన భారీ అవినీతి కారణంగానే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతోందని మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన గురువారం తిరుపతిలో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కర్మను తప్పించుకోగలమేమో గానీ, కరెంటు బిల్లును మాత్రం తప్పించుకోలేం. మన పిల్లలైనా ఆ బిల్లులు కట్టాల్సిందే" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చేసిన అవినీతికి సామాన్య వినియోగదారుడు ఎందుకు భారం మోయాలని ఆయన ప్రశ్నించారు. రూపాయి విలువ చేసే వస్తువును మూడు రూపాయలకు కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని అన్నారు.

గత ప్రభుత్వంలో నియమితులైన సంతోష్ రావు హయాంలోనే ఈ అవినీతికి బీజం పడిందని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు కోరినా అధికారులు ఇవ్వలేదని తెలిపారు. 12 సార్లు అప్పీలు చేసినా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని, 2023 నుంచి ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందని ఆయన విమర్శించారు. అధికారులు, కంపెనీలు కుమ్మక్కై అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు.

ఈ అవినీతిని అరికడితేనే విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలనే ఉద్దేశంతోనే దీనిని బయటపెడుతున్నట్లు చెప్పారు. పూర్తి ఆధారాలతో శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించారు.
AB Venkateswara Rao
APSPDCL
electricity charges
corruption allegations
Santhosh Rao
Tirupati
Andhra Pradesh
power distribution
RTI
Shivashankar

More Telugu News