KS Viswanathan: అర్హులందరికీ కొత్త అక్రిడిటేషన్‌లు ఇస్తాం: ఏపీ సమాచార శాఖ కమిషనర్ విశ్వనాథన్

KS Viswanathan Promises New Journalist Accreditations Soon
  • ఏపీ సమాచార శాఖ కమిషనర్ విశ్వనాథన్‌తో సమావేశమైన ఏపీయూడబ్ల్యూజే నేతల బృందం
  • వర్కింగ్ జర్నలిస్ట్‌ల సమస్యలపై చర్చించిన నేతలు
  • సానుకూలంగా స్పందించిన కమిషనర్ విశ్వనాథన్
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ త్వరలోనే కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సంచాలకుడు కె.ఎస్. విశ్వనాథన్ హామీ ఇచ్చారు. మరోసారి పాత అక్రిడిటేషన్లు పునరుద్ధరించకుండా, కొత్త అక్రిడేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం నిన్న సంచాలకుడు విశ్వనాథన్‌ను కలిసి జర్నలిస్టుల సమస్యలు, అక్రిడిటేషన్ల అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఏచూరి శివ, ఉపాధ్యక్షుడు చావా రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంలో పలు ముఖ్యమైన డిమాండ్లను ప్రస్తావించారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కమిటీ, వెల్ఫేర్ ఫండ్ కమిటీ వంటి సంస్థలను తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన వర్కింగ్ జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్‌ను పునరుద్ధరించి, ప్రభుత్వ ప్రకటన బిల్లుల నుండి 5 శాతం మొత్తాన్ని ఆ నిధికి మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డుల పథకాన్ని బలోపేతం చేయాలని, సమాచార శాఖ - ఆరోగ్యశ్రీ ట్రస్ట్ – జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

2016లో ప్రారంభమైన వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేయాలని కూడా కోరారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.

కరోనా కాలంలో రద్దైన రైల్వే రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. అలాగే, వయోభారంతో వృత్తి నుండి విరమించిన పాత్రికేయులకు పింఛన్ సదుపాయం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, సీనియర్ జర్నలిస్టులకు జీవన సాఫల్య పురస్కారం పునరుద్ధరణను కోరారు.

ఈ సూచనలన్నింటిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ విశ్వనాథన్ “జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణమే సమావేశాలు ఏర్పాటు చేసి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 
KS Viswanathan
AP Information Department
Journalist Accreditation
APUWJ
Journalist Welfare Fund
Health Cards Scheme
Journalist Insurance
Government Advertisements
Journalist Pension Scheme
Andhra Pradesh

More Telugu News