Amazon: అమెజాన్‌కు కర్నూలు ఫోరం షాక్.. ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్

Amazon India Directors Face Non Bailable Warrant in Kurnool Case
  • ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేస్తే మరో ఫోన్ డెలివరీ
  • స్పందించని అమెజాన్.. వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించిన బాధితుడు
  • డబ్బు వాపసు ఇవ్వాలని కోర్టు తీర్పు.. పట్టించుకోని సంస్థ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నూలు వినియోగదారుల ఫోరం
  • బెంగళూరు, పాట్నాలకు చెందిన ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది. ఓ వినియోగదారుడికి తప్పుడు ఉత్పత్తిని పంపి, ఆ తర్వాత కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసినందుకు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో ఏకంగా ముగ్గురు అమెజాన్ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే... కర్నూలుకు చెందిన వీరేశ్‌ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ. 80,000 చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ కోసం ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ సమయంలో వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో ఐఫోన్‌కు బదులుగా ఐక్యూ (iQOO) కంపెనీకి చెందిన ఫోన్ ఉండటంతో ఆయన షాక్‌కి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని అమెజాన్ కస్టమర్ కేర్‌కు తెలియజేసినా వారి నుంచి ఎలాంటి సరైన స్పందన లభించలేదు. పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తన వద్ద ఉన్న ఆధారాలతో వీరేశ్‌ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఫోరం, వీరేశ్‌కు వెంటనే సరైన ఐఫోన్‌ను డెలివరీ చేయాలని, లేదంటే అతను చెల్లించిన రూ. 80,000 తిరిగి ఇవ్వడంతో పాటు నష్టపరిహారంగా మరో రూ. 25,000 చెల్లించాలని అమెజాన్‌ను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును కూడా అమెజాన్ యాజమాన్యం పట్టించుకోలేదు.

దీంతో వినియోగదారుల ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గానూ, బెంగళూరుకు చెందిన ఇద్దరు, పాట్నాకు చెందిన ఒక డైరెక్టర్‌తో సహా మొత్తం ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఈ-కామర్స్ సంస్థ డైరెక్టర్లపై నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Amazon
Amazon India
Kurnool Consumer Forum
iPhone 15 Plus
iQOO
Non-Bailable Warrant
Consumer Complaint
Online Shopping
E-commerce
Customer Service

More Telugu News