Narendra Modi: దీపావళి సమయంలో అదిరిపోయే సేల్స్.. ప్రధాని మోదీపై పరిశ్రమ వర్గాల ప్రశంసలు

Narendra Modi Praised for Diwali Sales Success
  • దీపావళి సమయంలో దేశవ్యాప్తంగా రూ.6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా
  • మోజీ 'మేడిన్ ఇండియా' నినాదం కలిసి వచ్చిందంటున్న పరిశ్రమ వర్గాలు
  • రాబోయే ఆరు నుంచి ఏడాది కాలంలో మరిన్ని ఫలితాలు చూస్తామంటున్న సీఏఐటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'మేడిన్ ఇండియా' వంటి ఆర్థిక సంస్కరణలు క్షేత్రస్థాయిలో బలమైన ఫలితాలను ఇస్తున్నాయని భారత పారిశ్రామిక రంగ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్వహించిన సర్వే ప్రకారం, ఈ దీపావళి పండుగ సమయంలో దేశవ్యాప్తంగా అత్యధిక వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ. 6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా వేస్తున్నారు.

వినియోగదారుల విశ్వాసం, స్వదేశీ ఉత్పత్తులకు లభిస్తున్న ప్రోత్సాహం ఈ గణాంకాల ద్వారా తెలుస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ హర్వాన్ష్ చావ్లా ఐఏఎన్ఎస్ ఛానల్‌తో మాట్లాడుతూ, ఈ దీపావళి బంపర్ దీపావళి అవుతుందని తాను ముందే చెప్పానని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా అమ్మకాలు జరిగాయని అన్నారు.

ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోందని, ఈ ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 'మేడిన్ ఇండియా' నినాదం ఊపందుకుంటుందని, రానున్న ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.

దీపావళి పండుగకు ముందు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు వాణిజ్యంపై సానుకూల ప్రభావం చూపాయని పీహెచ్‌డీసీసీఐ సీఈవో అండ్ సెక్రటరీ జనరల్ రంజిత్ మెహతా అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం అస్థిరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా జరిగిన వ్యాపారంలో 80 శాతం భారతీయ ఉత్పత్తులవే ఉండటం గమనార్హమని అన్నారు.

చాలాకాలం తర్వాత ఈ దీపావళికి వినియోగం పెరిగిందని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ పచిసియా కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వినియోగ సంబంధిత వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం వ్యాపార వృద్ధికి దోహదపడిందని అన్నారు. సెప్టెంబర్ 22 తర్వాత జీఎస్టీ రేట్లు తగ్గడం దీపావళి అమ్మకాల పెరుగుదలకు కారణమని అన్నారు.
Narendra Modi
Diwali sales
Made in India
Indian economy
GST
Confederation of All India Traders

More Telugu News