Pakistan: పాక్‌లో ధరల మంట.. కిలో టమాటా రూ. 600, అల్లం రూ. 750!

Pakistan pays heavily for Afghan conflict tomato prices jump to Rs 600 per kg
  • పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటిన టమాటా ధర
  • రావల్పిండిలో కిలో టమాటా 600 రూపాయలు
  • అల్లం రూ. 750, బఠాణీలు రూ. 500కి చేరిక
  • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలే కారణం
  • ధరల ధాటికి టమాటాలు అమ్మడం మానేసిన చిరు వ్యాపారులు
పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా నిత్యావసరాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా రావల్పిండి నగరంలో కిలో టమాటా ధర ఏకంగా 600 రూపాయలకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, కానీ సరఫరా చాలా తక్కువగా ఉందని రావల్పిండి సబ్జీ మండీ ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షుడు గులాం ఖాదిర్ తెలిపారు. "ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి టమాటాల దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. సరఫరా తిరిగి పునరుద్ధరించబడే వరకు ధరలు తగ్గే అవకాశం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

టమాటాలే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. కిలో అల్లం ధర రూ. 750కి చేరగా, వెల్లుల్లి రూ. 400, బఠాణీలు రూ. 500 పలుకుతున్నాయి. ఉల్లిపాయల ధర కిలోకు రూ. 120కి పెరిగింది. క్యాప్సికమ్, బెండకాయలు కిలో రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. గతంలో ఉచితంగా ఇచ్చే కొత్తిమీర చిన్న కట్ట ఇప్పుడు రూ. 50కి చేరిందని స్థానిక మీడియా పేర్కొంది. పండ్ల ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. యాపిల్స్ కిలో రూ. 250 నుంచి 350, ద్రాక్ష రూ. 400 నుంచి 600 వరకు అమ్ముతున్నారు.

ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది చిరు వ్యాపారులు టమాటాలు, బఠాణీలు, అల్లం, వెల్లుల్లి వంటివి అమ్మడం మానేశారు. పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘ‌న్‌ భూభాగంపై వైమానిక దాడులు చేయడం, ఆ దేశ‌ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఉద్రిక్తతలే ప్రస్తుతం నిత్యావసరాల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే కూరగాయల కంటే వాఘా సరిహద్దు ద్వారా భారత్ నుంచి వచ్చే కూరగాయలు చౌకగా లభిస్తాయని ఓ వ్యాపారి చెప్పినట్లు స్థానిక పత్రికలు నివేదించాయి.
Pakistan
Pakistan Economy
Tomato price
Vegetable prices
Inflation
Rawalpindi
Afghanistan border
Pakistan Afghanistan relations
Economic crisis
Food prices
Cost of living

More Telugu News