Chandrababu: గల్ఫ్ ప్రవాసులకు అండగా 'ప్రవాసాంధ్ర భరోసా'.. దుబాయ్‌లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Pravasa Andhra Bharosa in Dubai
  • యూఏఈ పర్యటన కోసం దుబాయ్ చేరుకున్న సీఎం చంద్రబాబు
  • విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రవాసాంధ్రులు
  • గల్ఫ్ ప్రవాసుల కోసం 'ప్రవాసాంధ్ర భరోసా' బీమా పథకం ప్రారంభం
  • దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షల వరకు పరిహారం
  • ఎల్లుండి ప్రవాసీయులతో భారీ సమావేశంలో పాల్గొననున్న సీఎం
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. సీఎం చంద్రబాబు తన యూఏఈ పర్యటనలో భాగంగా ‘ప్రవాసాంధ్ర భరోసా’ అనే ప్రత్యేక బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద దురదృష్టవశాత్తు ప్రవాసీయులు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది.

మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం దుబాయ్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్థానిక భారత కాన్సుల్ జనరల్ సతీశ్‌ కుమార్ శివన్, టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర టీడీపీ అధ్యక్షుడు విశ్వేశరరావు, ఇతర అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్ర మహిళలు కూడా తరలివచ్చి స్వాగతం పలకడం విశేషం.

ఈ సందర్భంగా టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రవాసాంధ్ర భరోసా పథకం ఆపదలో ఉన్న ప్రవాసీ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. కష్టకాలంలో వారిని ఆదుకునేందుకే ఈ పథకాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రవాసీయులతో భారీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వివిధ గల్ఫ్ దేశాల నుంచి టీడీపీ అభిమానులు, ప్రముఖులు, ప్రవాసాంధ్రులు దుబాయ్‌కు చేరుకుంటున్నారు.
Chandrababu
Pravasa Andhra Bharosa
Andhra Pradesh
Gulf NRIs
Dubai
UAE
NRI Insurance Scheme
Ravi Radhakrishna
Satish Kumar Sivan
TDP Gulf

More Telugu News