Telangana Government: తెలంగాణలోని అన్ని చెక్ పోస్టులు రద్దు.. రవాణాశాఖ కీలక నిర్ణయం

Telangana Government Abolishes All Check Posts
తెలంగాణ వ్యాప్తంగా అన్ని రవాణా చెక్‌పోస్టుల ఎత్తివేత
తక్షణమే మూసివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ
ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్
సిబ్బందిని జిల్లా కార్యాలయాలకు తరలించాలని సూచన
బోర్డులు, బారికేడ్లు తొలగించి వీడియో తీయాలని ఆదేశం
తెలంగాణలో వాహనదారులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

రవాణా శాఖ కమిషనర్  జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని జిల్లా రవాణా అధికారులు (DTO), డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లను (DTC) ఆదేశించారు. ఆగస్టు 28, 2025న విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వు (G.O. Ms. No. 58) ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం, రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, ఇతర సూచికలను పూర్తిగా తొలగించాలని సూచించారు. ఈ తొలగింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీసి, నివేదికతో పాటు ఉన్నతాధికారులకు పంపాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల మూసివేత ప్రక్రియ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి కావాలని గడువు విధించారు.

ప్రస్తుతం చెక్‌పోస్టులలో పనిచేస్తున్న సిబ్బందిని వారి సంబంధిత జిల్లా రవాణా కార్యాలయాలకు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా, చెక్‌పోస్టులలో ఉన్న ఫర్నిచర్, రికార్డులు, పరికరాలు, ఇతర వస్తువులను వెంటనే డీటీవో కార్యాలయాలకు తరలించాలని తెలిపారు. క్యాష్ బుక్కులు, రసీదులు, చలాన్లతో సహా అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు.

చెక్‌పోస్టుల మూసివేత సమాచారాన్ని వాహనదారులకు తెలియజేసేందుకు సంబంధిత ప్రాంతాల్లో పబ్లిక్ నోటీసులు ప్రదర్శించాలని కమిషనర్ సూచించారు. సిబ్బంది పునర్‌నియామకం, రికార్డుల తరలింపు, చెక్‌పోస్టుల పూర్తి మూసివేతపై సమగ్ర నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయానికి సమర్పించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
Telangana Government
Telangana check posts
Check post abolition
Telangana transport department

More Telugu News