UPI Payments: దీపావళి ధమాకా.. యూపీఐ చెల్లింపుల్లో ఆల్-టైమ్ రికార్డ్!

UPI Payments Hit All Time Record High During Diwali
  • పండగ సీజన్‌లో భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు
  • రోజుకు సగటున రూ. 94,000 కోట్లకు చేరిన చెల్లింపులు
  • సెప్టెంబర్‌తో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదు
  • నెల మొత్తం విలువ రూ. 28 లక్షల కోట్లు దాటుతుందని అంచనా
  • ఈ నెలలో ఇప్పటికే ఆరుసార్లు లక్ష కోట్ల మార్కు దాటిన రోజువారీ విలువ
పండగ సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డులను సృష్టిస్తున్నాయి. దీపావళి కొనుగోళ్ల జోరుతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరుగుతున్న సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ. 94,000 కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది 13 శాతం అధికం కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా నెలవారీగా చూస్తే ఇదే అత్యధిక వృద్ధి అని నిపుణులు చెబుతున్నారు.

ఈ నెల ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే, యూపీఐ తన జీవితకాలంలోనే అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనను నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది. దీనికి దీపావళి పండగతో పాటు ఇటీవల జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు కూడా కారణంగా నిలుస్తున్నాయి. ఈ నెల‌ 20న దీపావళి సందర్భంగా చెల్లింపులు భారీగా పెరిగాయి. పండగకు ముందు రోజు యూపీఐలో ఒక్కరోజే 74 కోట్ల లావాదేవీలు జరిగి ఆల్‌-టైమ్‌ రికార్డు సృష్టించాయి. ఈ నెలలో ఇప్పటివరకు సగటున రోజుకు 69.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లోని 65.4 కోట్ల రికార్డును ఇది అధిగమించింది.

సాధారణంగా నెల ఆరంభంలో జీతాలు, ఈఎంఐ చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగా ఉండి, నెల మధ్యకు వచ్చేసరికి తగ్గుముఖం పడతాయి. కానీ, ఈసారి పండగ ప్రభావంతో ఆ ధోరణి మారింది. ఈ నెల‌ 20 నాటికే, రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. సెప్టెంబర్‌లో ఈ ఘనత కేవలం మూడుసార్లే నమోదైంది. ఈ దూకుడు చూస్తుంటే, ఈ నెలలో మొత్తం లావాదేవీల విలువ తొలిసారిగా రూ. 28 లక్షల కోట్లు దాటుతుందని, గత రికార్డయిన రూ. 25 లక్షల కోట్ల మార్కును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం.
UPI Payments
Digital Payments India
NPCI
Diwali Festival
Unified Payments Interface
Online Transactions
Digital Economy
GST Rates
Financial Transactions

More Telugu News