Fatehabad Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేశారు.. కేంద్రానికి లక్షల్లో నష్టం.. వీడియో ఇదిగో!

Agra Lucknow Expressway Toll Gate Free After Diwali Bonus Dispute
  • ఆగ్రా– లక్నో ఎక్స్ ప్రెస్ వేపై టోల్ గేట్ సిబ్బంది నిరసన
  • టోల్ వసూలు చేయకుండా వాహనాలను వదిలేసిన వైనం
  • టోల్ కట్టకుండానే వెళ్లిపోయిన వేలాది వాహనాలు
ఉత్తరప్రదేశ్ లోని ఫతేహాబాద్ టోల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి సిబ్బంది విధులు బహిష్కరించారు. కాంట్రాక్టు సంస్థ తమకు దీపావళి బోనస్ ఇవ్వలేదని ఆరోపిస్తూ టోల్ గేట్లను ఎత్తేశారు. వాహనాల నుంచి టోల్ వసూలు చేయకుండానే వాటిని వదిలివేశారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

ఆగ్రా– లక్నో ఎక్స్ ప్రెస్ వే పై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై ఫతేహాబాద్ టోల్ గేట్ వద్ద టోల్ వసూలు చేసే కాంట్రాక్టును శ్రీసాయి అండ్ దాతర్ కంపెనీ దక్కించుకుంది. కొంతమంది సిబ్బందిని నియమించుకుని టోల్ వసూలు చేస్తోంది. దీపావళి సందర్భంగా బోనస్ ఇస్తామని కంపెనీ నిర్వాహకులు హామీ ఇచ్చారని టోల్ గేట్ సిబ్బంది పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పిన యాజమాన్యం ఆ హామీని నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు.

దీంతో ఆదివారం టోల్ గేట్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. తమ కంపెనీ తీరుకు నిరసనగా టోల్ వసూలు నిలిపివేసి వాహనాలను వదిలివేశారు. దీంతో దాదాపు పది గంటల పాటు వేలాది వాహనాలు టోల్ కట్టకుండానే వెళ్లిపోయాయి. విషయం తెలిసి వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని పంపించి టోల్ వసూలు చేసేందుకు దాతర్ కంపెనీ యాజమాన్యం ప్రయత్నించగా.. స్థానిక సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారితో చర్చలు జరిపిన దాతర్ కంపెనీ యాజమాన్యం.. సిబ్బంది అందరికీ పది శాతం వేతనం పెంచేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఉద్యోగులంతా విధుల్లోకి చేరి టోల్ వసూలు చేయడం ప్రారంభించారు. కాగా, ఈ గొడవతో కేంద్ర ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Fatehabad Toll Plaza
Fatehabad
Toll gate
Diwali bonus
Agra Lucknow Expressway
Uttar Pradesh
Toll collection
Srisai and Datar company
Employee protest
Loss to central government

More Telugu News