Spruce Trees: ఫిన్లాండ్‌ అడవుల్లో బంగారు చెట్లు.. పరిశోధనలో ఏం తేలిందంటే..!

Norway Spruce Trees found to contain Gold in Finland
  • ఫిన్లాండ్‌ అడవుల్లోని చెట్ల ఆకుల్లో బంగారు రేణువులు
  • నార్వే స్ప్రూస్ అనే జాతి చెట్లపై శాస్త్రవేత్తల పరిశోధన
  • వేర్ల ద్వారా భూమిలోని బంగారం ఆకుల్లోకి చేరుతున్న వైనం
  • ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులదే కీలకపాత్ర అని నిర్ధారణ
  • ఖనిజాల అన్వేషణకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని వెల్లడి
"డబ్బులు చెట్లకు కాయవు" అనే మాటను మనం తరచూ వింటుంటాం. కానీ, ఫిన్లాండ్‌లో కొన్ని చెట్లు నిజంగానే బంగారాన్ని కాస్తున్నాయి. అక్కడి అడవుల్లోని 'నార్వే స్ప్రూస్' అనే జాతి చెట్ల ఆకుల్లో సూక్ష్మస్థాయిలో బంగారు రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఈ ఆవిష్కరణ సైన్స్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది.

ఫిన్లాండ్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కిట్టిలా బంగారు గని సమీపంలోని అడవుల్లో ఈ అద్భుతం వెలుగుచూసింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కలిసి 23 నార్వే స్ప్రూస్ చెట్లపై అధ్యయనం చేశారు. వాటి నుంచి 138 ఆకుల నమూనాలను సేకరించి మైక్రోస్కోప్‌ల సహాయంతో క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ క్రమంలో, చెట్ల ఆకుల కొనభాగంలో నానో పరిమాణంలో ఉన్న బంగారు కణాలు ఉన్నట్లు కనుగొన్నారు.

భూగర్భంలో సహజసిద్ధంగా ఉండే బంగారం, చెట్ల వేర్లు పీల్చుకునే నీటి ద్వారా నెమ్మదిగా ఆకుల్లోకి చేరుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ప్రక్రియలో 'ఎండోఫైట్స్' అనే బ్యాక్టీరియాతో పాటు ఇతర సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అవి బంగారాన్ని ఘనరూపంలోకి మార్చి ఆకులలో నిక్షిప్తం చేస్తున్నాయని వివరించారు.

అయితే, ఈ లక్షణం అన్ని స్ప్రూస్ చెట్లలో కనిపించదని పరిశోధకులు స్పష్టం చేశారు. నేల స్వభావం, నీటి ప్రవాహం, సూక్ష్మజీవుల ఉనికి వంటి అంశాలు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని చెట్లలో మాత్రమే బంగారం నిక్షిప్తమవుతున్నట్లు తెలిపారు. మొక్కల ఆధారంగా భూమిలోని ఖనిజ నిక్షేపాలను అన్వేషించేందుకు (బయోజియోకెమిస్ట్రీ) ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
Spruce Trees
Norway Spruce
Finland
gold
trees
Kittila gold mine
geological survey
bio geochemistry
gold particles
Oulu University

More Telugu News