Venkateswara Swamy Temple: హుండీలో డబ్బులు ఎంత తెలివిగా కొట్టేశాడో చూడండి!

Venkateswara Swamy Temple Hundi Robbed Using Bubblegum in West Godavari
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో హుండీ చోరీ
  • వైరుకు బబుల్‌గమ్ అంటించి నగదు చోరీ
  • కొంతకాలంగా ఇదే పద్ధతిలో చోరీలు
  • అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టిన ఆలయ వర్గాలు
  • సీసీటీవీ ఫుటేజీలో బట్టబయలైన దొంగతనం
  • కేటుగాడి కోసం పోలీసుల గాలింపు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. దేవుడి హుండీకే కన్నం వేసిన ఓ కేటుగాడు, బబుల్‌గమ్‌ను ఉపయోగించి చాకచక్యంగా డబ్బులు కాజేస్తున్న వైనం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన వీరవాసరం మండలం తోకలపూడిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కొంతకాలంగా హుండీ ఆదాయంలో తేడాలు గమనించిన ఆలయ వర్గాలకు అనుమానం వచ్చింది. హుండీకి ఎలాంటి నష్టం కలగకుండా డబ్బులు ఎలా మాయమవుతున్నాయో అంతుచిక్కలేదు. దీంతో దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆలయ ప్రాంగణంలో, ముఖ్యంగా హుండీ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

తాజాగా రికార్డైన ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బట్టబయలైంది. ఓ వ్యక్తి రాత్రిపూట ఆలయంలోకి ప్రవేశించి, ఒక పొడవాటి వైరుకు చివర బబుల్‌గమ్ అంటించి హుండీ లోపలికి పంపిస్తున్నాడు. ఆ జిగురుకు అంటుకున్న కరెన్సీ నోట్లను చాలా నేర్పుగా బయటకు లాగుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. పలుమార్లు ఇదే పద్ధతిలో అతను చోరీకి పాల్పడినట్లు నిర్వాహకులు గుర్తించారు.

ఈ వీడియో ఆధారంగా ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Venkateswara Swamy Temple
West Godavari
Temple theft
Hundi theft
Bubblegum theft
Andhra Pradesh crime
Tokalapudi
Veeravasaram
CCTV footage
Hundi income

More Telugu News