Nitish Kumar: మహిళా అభ్యర్థి మెడలో పూలదండ వేసిన నితీశ్ కుమార్.. స్పందించిన తేజస్వి యాదవ్

Nitish Kumar Garlands Female Candidate Tejashwi Yadav Reacts
  • పార్టీ నాయకులు వారించినప్పటికీ మహిళా అభ్యర్థి మెడలో పూలదండ వేసిన నితీశ్
  • ఎంపీ సంజయ్ ఝా వారించడంతో తొలుత వెనక్కి తగ్గి, ఆ తర్వాత దండ వేసిన నితీశ్
  • నితీశ్ ఆరోగ్యం బాగా ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారని తేజస్వి యాదవ్ ప్రశ్న
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక మహిళా అభ్యర్థి మెడలో పూలదండ వేయడం ఎన్నికల వేళ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నితీశ్ కుమార్ తాజా చర్య ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకులు వారించినప్పటికీ నితీశ్ కుమార్ మహిళా అభ్యర్థికి పూలదండ వేయడం గమనార్హం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ, దీనిని ఎన్నికల సమయంలో రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచార సభను నిర్వహించింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న నితీశ్ కుమార్ వద్దకు చేతులు జోడిస్తూ బీజేపీకి చెందిన ఒక మహిళా అభ్యర్థి వచ్చారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ తన చేతిలో ఉన్న దండను ఆమె మెడలో వేయబోయారు. ఎంపీ సంజయ్ ఝా వారించడంతో మొదట వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ దండను మహిళ మెడలో వేశారు.

ఈ వీడియోను తేజస్వి యాదవ్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. నితీశ్ కుమార్ ఆరోగ్యంగానే ఉంటే, రాసిచ్చిన ప్రసంగాన్ని చదివిన తర్వాత ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. గతంలోనూ తేజస్వి యాదవ్ నితీశ్ కుమార్ ఆరోగ్యంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన పదే పదే నమస్కరిస్తున్న వీడియోను పోస్టు చేస్తూ, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని ఆరోపించారు.
Nitish Kumar
Bihar Elections
Tejashwi Yadav
NDA
BJP
Sanjay Jha
Bihar Politics

More Telugu News