Chandrababu Naidu: స్టార్‌బక్స్ తరహాలో అరకు కాఫీ, మిల్లెట్ ఔట్‌లెట్లు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Plans Arakku Coffee Millet Outlets Like Starbucks
  • మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం
  • డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్
  • స్టార్‌బక్స్ తరహాలో అరకు కాఫీ, మిల్లెట్ ఔట్‌లెట్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రొడెక్ట్ క్లస్టర్ల ఏర్పాటుకు ఆదేశం
  • లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి ప్రణాళిక
  • ‘మెప్మా-మన మిత్ర’ యాప్‌ను ప్రారంభించిన సీఎం
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను పొదుపు సంఘాల స్థాయి నుంచి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బృహత్ ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రపంచ ప్రసిద్ధ స్టార్‌బక్స్ తరహాలో ‘అరకు కాఫీ-మిల్లెట్’ ఔట్‌లెట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. "డ్వాక్రా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తుల వారీగా 100 క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం వంటి రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించాలి" అని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం డ్వాక్రా మహిళల తలసరి ఆదాయం రూ.1,45,000గా ఉందని, దీనిని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే ఈనాడు తెలుగువారు ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్నారని, అదే స్ఫూర్తితో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆర్థిక క్రమశిక్షణే వారి బలం

డ్వాక్రా మహిళల ఆర్థిక క్రమశిక్షణను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. "ఒకప్పుడు నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి అద్భుతాలు సృష్టించాం. ఈనాడు వారు రూ.20,739 కోట్లను పొదుపు చేయగలుగుతున్నారు. దీనికి రెట్టింపు మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా పొందుతున్నారు. తీసుకున్న రుణాలను 99 శాతానికి పైగా తిరిగి చెల్లిస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. ఇంతటి బలమైన నెట్‌వర్క్‌ను మనం సద్వినియోగం చేసుకోవాలి" అని ఆయన తెలిపారు. 

మహిళలకు గంటల్లోనే రుణాలు అందేలా చూడాలని, అవసరమైతే వారి పెట్టుబడులకు మార్గదర్శనం చేసేందుకు ఫండ్ మేనేజర్‌ను నియమించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.

సరికొత్త వ్యాపార అవకాశాలు

కేవలం సంప్రదాయ ఉత్పత్తులకే పరిమితం కాకుండా, ఆధునిక వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. "అరకు కాఫీ, మిల్లెట్ల కలయికతో స్టార్‌బక్స్ తరహాలో ఆకట్టుకునే డిజైన్లతో ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర తరహాలో బ్యాంబూ మిషన్ పాలసీపై అధ్యయనం చేసి వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలి. మునగాకు, గుర్రపు డెక్కతోనూ విలువైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఆక్వా రంగంలో సీవీడ్ కల్చర్‌ను ప్రోత్సహించాలి. డ్రోన్లు నడపడం నుంచి ఎగ్ కార్ట్, ఆక్వా కార్ట్, మిల్లెట్ కార్ట్ వంటి ప్రయోగాత్మక వ్యాపారాల వైపు వారిని ప్రోత్సహించాలి" అని వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. టూరిజం రంగంలో హోం స్టేల నిర్వహణలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు.

టెక్నాలజీతో కొత్త సేవలు

సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి పలు డిజిటల్ సేవలను ప్రారంభించారు. మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలను అందించే ‘మెప్మా-మన మిత్ర’ యాప్‌ను ఆవిష్కరించారు. మెప్మా సభ్యులకు వర్చువల్ శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ప్రగ్న్యా’ యాప్‌ను కూడా ప్రారంభించారు. మెప్మా కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ‘అవని’ వార్షిక సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా, బ్యాంకు నుంచి రూ.1.25 కోట్ల రుణం పొంది విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్న మంగళగిరికి చెందిన మహిళను అభినందించి, ఆమెకు చెక్కును అందజేశారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ వర్చువల్‌గా పాల్గొనగా, సెర్ప్, మెప్మా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
DWCRA women
Andhra Pradesh
Arakku coffee
Millet outlets
Women empowerment
SERP
MEPMA
MSME
Startups

More Telugu News