Chandrababu Naidu: రేపటి నుంచి యూఏఈలో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట

Chandrababu Naidu to Seek Investments in UAE Starting Tomorrow
  • రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన
  • రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం
  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
  • పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలతో చంద్రబాబు భేటీ
  • సీఐఐ రోడ్ షో, ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొననున్న సీఎం
  • సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడమే అజెండాగా ఆయన బుధవారం నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో పాటు మంత్రులు, కీలక శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం కూడా పాల్గొంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు (పార్టనర్‌షిప్ సమ్మిట్) వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగనుంది. ఈ సదస్సుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించడం కూడా ఈ పర్యటనలో కీలక ఉద్దేశం. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు బృందం దుబాయ్‌కు బయల్దేరి వెళుతుంది. ఈ మూడు రోజుల్లో సీఎం పలువురు పారిశ్రామికవేత్తలు, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటికే ప్రభుత్వం సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

పర్యటనలో భాగంగా తొలిరోజైన అక్టోబర్ 22న చంద్రబాబు ఐదు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్, లూలూ గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి దిగ్గజ సంస్థల యాజమాన్యాలతో ఆయన చర్చలు జరుపుతారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. దీనితో పాటు దుబాయ్‌లో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించే రోడ్ షోలో కూడా సీఎం పాల్గొంటారు.

పర్యటన చివరి రోజున ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా (ప్రవాసాంధ్రులు) సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh investments
UAE tour
Partnership Summit
Visakhapatnam
Industrial development
APNRT
Telugu diaspora
Dubai
Foreign investments

More Telugu News