Siddaramaiah: బెంగళూరు రోడ్లపై విమర్శలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Siddaramaiah Orders Bangalore Road Repairs in One Week
  • బెంగళూరు రహదారులపై పారిశ్రామికవేత్తల విమర్శలు
  • అన్ని గుంతలు పూడ్చి వేయాలని సిద్ధరామయ్య ఆదేశాలు
  • గుంతల మరమ్మతులకు అక్టోబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడి
బెంగళూరు నగరంలోని రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైనందున, వాటిని వారం రోజుల్లో బాగు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. బెంగళూరు రహదారుల దుస్థితి, ట్రాఫిక్ సమస్యలపై కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మంజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు సైతం ఈ సమస్యలను లేవనెత్తారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో బెంగళూరు రహదారులపై ఉన్న గుంతలన్నింటినీ పూడ్చివేయాలని ఆదేశించారు. నగరంలోని ఐదు కార్పొరేషన్ల పరిధిలోని గుంతల మరమ్మతులకు అక్టోబర్ 31 వరకు గడువు విధించారు. గాంధీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైట్ టాపింగ్‌తో సహా రోడ్ల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ, బెంగళూరు రోడ్ల సమస్యలపై గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ తుషార్ గిరినాథ్ సహా ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలు కారణంగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చడం ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని, వైట్ టాపింగ్ చేయడం వల్ల రోడ్లు 25 నుంచి 30 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే అన్ని రహదారులకు వైట్ టాపింగ్ చేయిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు అందిస్తున్నామని, దీనికి బడ్జెట్‌లో రూ. 8 వేల కోట్లు కేటాయిస్తున్నామని సిద్ధరామయ్య వెల్లడించారు.
Siddaramaiah
Karnataka
Bangalore roads
Bangalore traffic
Road repairs
White topping
Kiran Mazumdar Shaw

More Telugu News