Asif: క్రిమినల్ రియాజ్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఆసిఫ్ సాహసం చేశాడు: డీజీపీ శివధర్ రెడ్డి

Asif bravely tried to catch criminal Riyaz says DGP
  • పతేమైదాన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బైక్ మెకానిక్ ఆసిఫ్
  • ఆసుపత్రిలో ఆసిఫ్‌ను పరామర్శించిన డీజీపీ శివధర్ రెడ్డి
  • ప్రస్తుతం ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న డీజీపీ
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్‌ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నాంపల్లి పతేమైదాన్‌లోని గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఆసిఫ్‌కు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ వెల్లడించారు. గ్యాలంటరీ అవార్డు కోసం ఆసిఫ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. ఆసిఫ్ ఎంతో సాహసం చేశాడని ఆయనను ప్రశంసించారు. నేరస్థుడి చేతిలో కత్తి ఉన్నప్పటికీ ధైర్యంగా అతడిని పట్టుకున్నాడని కొనియాడారు.

ఆసిఫ్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడని, అతని ధైర్యం ప్రశంసనీయమని డీజీపీ అన్నారు. పోలీసు డిపార్టుమెంట్ తరఫున ఆసిఫ్‌కు అవసరమైన సహాయం అంతా అందిస్తామని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని, పూర్తిగా కోలుకోవడానికి మాత్రం రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని డీజీపీ పేర్కొన్నారు.
Asif
Nizamabad constable murder case
Riyaz
DGP Shivadhar Reddy
Bike mechanic Asif
Telangana Police

More Telugu News