JC Prabhakar Reddy: తాడిపత్రి ఏఎస్పీపై జేసీ ఫైర్.. యూపీకి తిప్పి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు

JC Prabhakar Reddy Fires at Tadipatri ASP Threatens to Send Him Back to UP
  • తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • ఏఎస్పీకి చదువు తప్ప బుద్ధి, జ్ఞానం లేవని వివాదాస్పద వ్యాఖ్య
  • ఘర్షణలు జరిగితే ఏఎస్పీ భయపడి పారిపోతారని ఎద్దేవా
స్థానిక ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని, బుద్ధి, జ్ఞానం ఏమాత్రం లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదివేల మందితో సంతకాలు సేకరించి ఆయన్ను తిరిగి ఉత్తరప్రదేశ్‌కు పంపించేస్తామని హెచ్చరించారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పించిన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్సులో కనిపించలేదు. ఆయనకు చదువు తప్ప బుద్ధి, జ్ఞానం, తెలివి లేవు. ఈ ఉద్యోగానికి ఆయన అనర్హుడు" అని జేసీ విమర్శించారు. తాను కార్యాలయం ముందు నిరసన తెలిపితే, ఏఎస్పీ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నారని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఎక్కడైనా రాళ్ల దాడి జరిగితే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతారని ఆరోపించారు.

ఏఎస్పీ రోహిత్ కుమార్ తాడిపత్రికి వచ్చిన తర్వాత కూడా నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే క్రైమ్ రేట్ తగ్గిందని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారంటూ ఆయన వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉండవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

కిందిస్థాయి సిబ్బంది అయిన కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలను చూసి ఏఎస్పీ చాలా విషయాలు నేర్చుకోవాలని జేసీ హితవు పలికారు. గత ఐదేళ్ల పాలనలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
JC Prabhakar Reddy
Tadipatri
ASP Rohit Kumar
Andhra Pradesh Police
Uttar Pradesh
TDP
Police Commemoration Day
Crime Rate
Political Criticism
Municipal Chairman

More Telugu News