Vangalapudi Anitha: పోలీసుల వల్లే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు: అనిత

Vangalapudi Anitha Says People Live Peacefully Because of Police
  • పోలీసు అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న అనిత
  • పోలీసు శాఖలో 6,100 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని వెల్లడి
  • మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వ్యాఖ్య
పోలీసు శాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,100 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో నిర్వహించిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు పోలీసుల త్యాగాలే కారణమని కొనియాడారు. విధి నిర్వహణలో వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని, నేరాల నియంత్రణలో ఏపీ పోలీసులు దేశంలోనే ముందున్నారని ప్రశంసించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత ఉద్ఘాటించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్ టీం’ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించామని చెప్పారు. నిఘాను మరింత పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. 
Vangalapudi Anitha
Andhra Pradesh Police
APSP Battalion
Chandrababu Naidu
Harish Kumar Gupta
Police Martyrs Memorial Day
Police Jobs
Crime Control
Drugs Free Andhra Pradesh
Eagle Team

More Telugu News