Maoists: లొంగిపోయిన మల్లోజుల, ఆశన్నలకు మావోయిస్టు రాష్ట్ర కమిటీ స్ట్రాంగ్ వార్నింగ్

Maoist Party Issues Strong Warning to Surrendered Leaders Mallojula Asanna
  • విప్లవోద్యమానికి తీవ్ర ద్రోహం చేశారంటూ రాష్ట్ర కమిటీ ఆగ్రహం
  • అమరుల సాక్షిగా శిక్ష తప్పదని తెలంగాణ కమిటీ శపథం
  • జగన్ పేరిట విడుదలైన అధికారిక లేఖ
  • ఈ నెల 24న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు
  • ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా నిరసనలంటున్న కేంద్ర కమిటీ
ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు మావోయిస్టు పార్టీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వారిని క్షమించేది లేదని, కఠినంగా శిక్షించి తీరుతామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 24న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ మరో ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేణుగోపాల్, ఆశన్నలు తీవ్రమైన నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆ లేఖలో ఆరోపించారు. "విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. వారి చర్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది" అని లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్ర 'ఆపరేషన్ కగార్'తో మొదలైందని వారు ఆరోపించారు.

మరోవైపు, మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మరో లేఖ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 'ఆపరేషన్ కగార్' పేరుతో యుద్ధం చేస్తున్నాయని, మావోయిస్టులను హత్య చేస్తున్నాయని ఆ లేఖలో విమర్శించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, 24వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
Maoists
Mallojula Venugopal
Asanna
Telangana
Operation Kagar
Naxalites
India Bandh
Maoist Party
Abhay
Jagan

More Telugu News