Satyendra Shah: నామినేషన్ వేసి బయటకు రాగానే అభ్యర్థి అరెస్టు.. కారణం ఇదే!

Bihar RJD Candidate Satyendra Shah Alleges Political Conspiracy After Arrest
  • బీహార్ లో తొలి విడత ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ప్రక్రియ
  • ఆర్జేడీ తరఫున ససారం నియోజకవర్గంలో సత్యేంద్ర షా నామినేషన్
  • 21 సంవత్సరాల నాటి కేసులో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పార్టీ టికెట్ దక్కిన సంతోషంలో అనుచరులతో అట్టహాసంగా వెళ్లి నామినేషన్ వేశాడు.. లోపల రిటర్నింగ్ అధికారికి పత్రాలన్నీ దాఖలు చేసి బయటకు అడుగుపెట్టాడు.. అప్పటికే అక్కడ వేచి ఉన్న పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. బీహార్ లోని ససారం నియోజకవర్గంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి సత్యేంద్ర షాకు ఎదురైందీ అనుభవం. 

ఈ ఘటన బీహార్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పాత కేసులో వారెంట్ ఉన్నందుకే అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా.. రాజకీయ కక్షతోనే అరెస్టు చేయించారని సత్యేంద్ర మండిపడుతున్నారు. సత్యేంద్ర షా అరెస్టుపై ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ కోసం గుమిగూడిన గ్రాండ్ అలయన్స్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షా విజయం సాధించారని ప్రకటించారు. సబ్‌డివిజన్ కార్యాలయం వెలుపల కొద్దిసేపు గందరగోళం చెలరేగింది.

అరెస్టు చేసింది ఝార్ఖండ్ పోలీసులు..
సత్యేంద్ర షా సోమవారం అనుచరులతో కలిసి వెళ్లి ససారం నియోజకవర్గం ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. అంతకుముందే అక్కడికి చేరుకున్న ఝార్ఖండ్ పోలీసులు.. సత్యేంద్ర నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చాక అదుపులోకి తీసుకున్నారు. 2004లో ఝార్ఖండ్‌లోని గర్హ్వా పోలీస్ స్టేషన్‌ లో సత్యేంద్రపై ఓ కేసు నమోదైందని, ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.

ఇప్పటి దాకా ఎందుకు ఆగారు..?: సత్యేంద్ర
21 ఏళ్ల నాటి కేసు.. వారెంట్ జారీ అయి కూడా ఏళ్లు గడుస్తోందని సత్యేంద్ర గుర్తుచేశారు. మరి ఇంతవరకు పోలీసులు ఎందుకు ఆగారని, సరిగ్గా ఈ ఎన్నికల సమయంలోనే.. అది కూడా ఆర్జేడీ టికెట్ పై నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే ఎందుకు అరెస్టు చేశారని సత్యేంద్ర ప్రశ్నిస్తున్నారు. ఇది తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్రేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Satyendra Shah
RJD
Rashtriya Janata Dal
Sasaram
Bihar Politics
Arrest
Nomination
Grand Alliance
Jharkhand Police
Garhwa Police Station

More Telugu News