Praveen: బెంగళూరులో దారుణం: వైద్యం పేరుతో యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు

Bangalore Doctor Praveen Accused of Molesting Young Woman
  • పరీక్ష పేరుతో అరగంట పాటు నరకం చూపించిన వైద్యుడు
  • క్లినిక్ ముందు బాధితురాలి కుటుంబం ఆందోళన
  • డాక్టర్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించిన పోలీసులు
  • అపార్థం చేసుకున్నారంటూ ఆరోపణలు ఖండించిన నిందితుడు
వైద్యుడి చేతిలో ఓ యువతి లైంగిక వేధింపులకు గురైన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చర్మవ్యాధికి చికిత్స కోసం తన క్లినిక్‌కు వచ్చిన 21 ఏళ్ల యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై పోలీసులు 56 ఏళ్ల డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు శనివారం సాయంత్రం డాక్టర్ ప్రవీణ్ ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లింది. సాధారణంగా ఆమె తన తండ్రితో కలిసి క్లినిక్‌కు వస్తుంటుంది, కానీ ఆ రోజు ఆయనకు వీలు కాలేదు. యువతి ఒంటరిగా రావడాన్ని అదునుగా తీసుకున్న డాక్టర్ పరీక్ష పేరుతో ఆమెను అరగంట పాటు లైంగికంగా వేధించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

చర్మ ఇన్ఫెక్షన్‌ను పరిశీలించే నెపంతో తనను అసభ్యంగా తాకాడని, బలవంతంగా కౌగిలించుకుని చాలాసార్లు ముద్దు పెట్టాడని ఆమె ఆరోపించింది. ఆమె ప్రతిఘటించినా వినకుండా, పరీక్షలో భాగంగా దుస్తులు విప్పమని బలవంతం చేశాడని తెలిపింది. అంతటితో ఆగకుండా, ఇద్దరూ కలిసి హోటల్ రూమ్‌లో గడుపుదామంటూ అసభ్యకరమైన ప్రతిపాదన కూడా చేసినట్టు యువతి పోలీసులకు వివరించింది.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు క్లినిక్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అశోక్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, డాక్టర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, డాక్టర్ ప్రవీణ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను కేవలం వైద్య పరీక్ష మాత్రమే చేశానని, యువతి తన చర్యలను అపార్థం చేసుకుందని వాదించారు. పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 75, 79 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Praveen
Bangalore
sexual harassment
dermatologist
Ashok Nagar police
skin infection
molestation
Karnataka
crime

More Telugu News