Chandrababu Naidu: పోలీస్ అమరవీరుల దినోత్సవం .. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu on Police Martyrs Day Key Comments
  • మంగళగిరిలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • ప్రజా రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారు పోలీసులన్న సీఎం
  • శాంతి భద్రతలతోనే అభివృద్ధి, సంక్షేమం ముడిపడి ఉంటాయని వ్యాఖ్య
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభంలో భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి, అనంతరం పోలీస్ అమరవీరుల స్మారక స్తూపానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. పోలీసుల సేవలను ప్రశంసించారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నది పోలీసులేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "శాంతి భద్రతలతోనే అభివృద్ధి, సంక్షేమం ముడిపడి ఉంటాయి. రాష్ట్రంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు. క్రైమ్ రేట్‌ను అణచివేయడంలో నేను ఎప్పుడూ రాజీపడను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఒక ‘బ్రాండ్’గా నిలిచారని తెలిపారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపి పోలీసుల ప్రతిష్ఠను పెంచారని గుర్తుచేశారు. "పోలీసులు కఠినంగా ఉన్నా, వారిలో మానవత్వం ఎక్కువ" అని అభినందించారు.

నేరాల తీరు మారుతోందని, సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం మాఫియాలను గుర్తించి అణచివేస్తున్నామని చెప్పారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అవసరం ఉందని సూచించిన ముఖ్యమంత్రి.. "పోలీసులు కూడా కొత్త వెర్షన్‌గా మారాలి. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటేనే వారిని అరికట్టగలం" అన్నారు.

గూగుల్ వైజాగ్ పెట్టుబడులు రావడానికి కారణం రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ స్థిరత్వమే అని పేర్కొన్నారు. "భవిష్యత్తు ఏఐ టెక్నాలజీది. రాజకీయ ముసుగులో కొత్త నేరాలు పెరుగుతున్నాయి. కొన్ని పార్టీలు ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. కుల, మత విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Chandrababu Naidu
AP Police
Police Commemoration Day
Andhra Pradesh
Crime Rate
Cyber Crime
Law and Order
APSP Battalions
Vangalapudi Anita
Harish Kumar Gupta

More Telugu News