Mamata Banerjee: మమతా బెనర్జీ ప్రధాని అవుతారు.. లేదా జ్యోతిబసు రికార్డును బద్దలుగొడతారు: టీఎంసీ నేత జోస్యం

Mamata Banerjee to be PM or Break Jyoti Basu Record TMC Leader Predicts
  • 2029లో ప్రధాని మమత ప్రధాని అవుతారన్న కునాల్ ఘోష్
  • లేదంటే 2036 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జోస్యం
  • మమత తర్వాత అభిషేక్ బెనర్జీ సీఎం అవుతారని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029లో ఆమె ప్రధానమంత్రి అవుతారని, ఒకవేళ అది జరగకపోతే పశ్చిమ బెంగాల్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసు రికార్డును బద్దలు కొడతారని జోస్యం చెప్పారు. ఆ తర్వాత మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని కూడా పేర్కొన్నారు.

కాళీ పూజ, దీపావళి పర్వదినాల సందర్భంగా సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను, పార్టీలోని కొందరు అసమ్మతివాదులను ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ చేశారు. "కొంతమంది అసూయపరులు, నిరాశలో ఉన్న నిందలు వేసేవారికి చెబుతున్నా. మమతా బెనర్జీ జ్యోతి బసు రికార్డును బద్దలు కొడతారు. ఆమె 2036 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత ఆమె ఆశీస్సులతో అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి అవుతారు" అని కునాల్ ఘోష్ తన 'ఎక్స్' ఖాతాలో స్పష్టం చేశారు.

అదే సమయంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ "ఒకవేళ 2029లో మమతా బెనర్జీ ప్రధాని అయితే, అప్పుడు కథ మరోలా ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను ఎద్దేవా చేస్తూ "ప్రతిపక్షాలు మీడియా, సోషల్ మీడియాలోనే ఉండాలి. తృణమూల్ నబన్నాలో (రాష్ట్ర సచివాలయం) ఉంటే ప్రతిపక్షం ఫేస్‌బుక్‌లో ఉంటుంది" అని ఘోష్ విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జ్యోతి బసుకు ఉంది. ఆయన 1977 నుంచి 2000 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, 2026లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి, అధికారంలోకి రావాలని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కునాల్ ఘోష్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Mamata Banerjee
Mamata Banerjee PM
Kunal Ghosh
Jyoti Basu
Abhishek Banerjee
TMC
West Bengal CM
2029 Elections
Trinamool Congress
West Bengal Politics

More Telugu News