Nara Lokesh: ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో మంత్రి లోకేశ్ భేటీ

Nara Lokesh Meets Australian Minister Andrew Giles on Skill Development
  • టాఫే ఎన్ఎస్ డబ్ల్యూ అల్టిమో క్యాంపస్ ను సందర్శించిన మంత్రి లోకేశ్ 
  • నైపుణ్య శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్ విజ్ఞప్తి
  • ఏపీ విద్యాసంస్థలు, TAFE NSW మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజి, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ మార్గాలను అన్వేషించాలన్న లోకేశ్
ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ TAFE NSW (టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ - న్యూ సౌత్ వేల్స్) అల్టిమో క్యాంపస్‌ (సిడ్నీ)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. TAFE NSW అల్టిమో క్యాంపస్‌లో మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ ఫ్లనాగన్, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ సీనియర్ మేనేజర్ యువాన్ పెంగ్, రిక్రూట్‌మెంట్ సీనియర్ మేనేజర్ జెర్రీ సైడెన్, టూర్ టీమ్ ప్రతినిధి రజియా అహ్మదీ, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఆఫీసర్ యాష్ ట్రీక్, స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎమిలియా హచిన్సన్ తదితరులు మంత్రి లోకేశ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.

ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ-అకడమిక్ సహకార వ్యవస్థలో TAFE NSW కీలక పాత్ర పోషిస్తోందని గైల్స్ తెలిపారు. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (UTS), సిడ్నీ యూనివర్సిటీ, ABC, చైనాటౌన్, సీబీడీ వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ క్యాంపస్‌లో గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రత్యేక స్టూడియోలు, విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇది ప్రాక్టికల్ వృత్తి శిక్షణను అందిస్తుంది. TAFE NSW ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను చురుకుగా కొనసాగిస్తూ, పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించడంలో, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంలో ముందుందని ఆండ్రూ గైల్స్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాధాన్యతా రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను స్థాపించేందుకు APEDB/APSSDCలతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లలో TAFE NSW స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపన అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్యప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలు, TAFE NSW మధ్య స్టూడెంట్ ఎక్స్ఛేంజ్, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ మార్గాలను అన్వేషించాలని కోరారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ - 2025కు హాజరుకావాలని ఆహ్వానించారు. DFAT ప్రత్యేక సందర్శకుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ లీడర్స్‌ను చేర్చాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, ఐటీ, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, నిర్మాణ రంగాల వంటి అధిక డిమాండ్ ఉన్న విభాగాల్లో వృత్తి ప్రాధాన్య శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక సంస్థలతో భాగస్వామ్యం వహించాలని కోరారు. బోధన పద్ధతులను మెరుగుపరచడం, వృత్తి విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానించేందుకు స్థానిక ఉపాధ్యాయుల కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానికంగా TAFE NSW అర్హతలను సంపాదించడానికి, తద్వారా ఆస్ట్రేలియాలో మరింత ఉన్నత విద్య లేదా ఉపాధి అవకాశాలను పొందగల మార్గాలను చూపించాలని కోరారు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో TAFE NSW నైపుణ్యాన్ని ఉపయోగించి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించేందుకు TAFE NSW, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటుకు చొరవ చూపాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యాపార రంగాలపై దృష్టి సారిస్తూ, మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి, లింగ సమానత్వం, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ కోరారు. 
Nara Lokesh
Andhra Pradesh
Australia
TAFE NSW
skill development
vocational training
Andrew Giles
IT sector
APSSDC
Partnership Summit 2025

More Telugu News