Asrani: బాలీవుడ్ సీనియర్ నటుడు అస్రానీ కన్నుమూత

Bollywood Actor Asrani Passes Away at 84
  • అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన అస్రానీ
  • చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూసిన అస్రానీ
  • అస్రానీ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్న పలువురు సినీ ప్రముఖులు, సహచరులు
  • 350కిపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన అస్రానీ
బాలీవుడ్‌ సీనియర్ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అస్రానిని నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అస్రాని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సహచరులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1941లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జన్మించిన అస్రాని.. ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అదే సమయంలో తన విద్యను పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో 1962లో ముంబయికి వెళ్లారు. అక్కడ దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.

1966లో విడుదలైన “హమ్ కహా జా రహే హై” సినిమాతో వెండితెరపై తొలి అడుగుపెట్టిన ఆయన, 1967లో వచ్చిన “హరే కాంచ్ కీ చూడియా”తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, “షోలే” సినిమాలో ఆయన పోషించిన జైలర్ పాత్ర ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టింది.

సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అస్రాని 350కిపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. “హీరో హిందూస్థానీ”, “డ్రీమ్ గర్ల్ 2” వంటి చిత్రాల్లో కూడా ఆయన గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. అంతేకాకుండా “చలా మురారీ హీరో బన్నే”, “ఉడాన్” వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు.

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడిగా పేరుగాంచిన అస్రాని మరణం సినీ ప్రపంచానికి పూడ్చలేని లోటు అని అభిమానులు చెబుతున్నారు. 
Asrani
Asrani death
Bollywood actor
Govardhan Asrani
Senior actor death
Hindi cinema
Showole movie
Dream Girl 2
Bollywood news
Indian cinema

More Telugu News