Rahul Gandhi: త్వరగా పెళ్లి చేసుకోండి సార్.. ఇక్కడ మేం వెయిటింగ్!: రాహుల్ గాంధీకి ఓ స్వీట్ షాప్ ఓనర్ విన్నపం

Ghantewala Owner Asks Rahul Gandhi About Wedding Plans
  • దీపావళి సందర్భంగా పాత ఢిల్లీ స్వీట్ షాపులో రాహుల్ గాంధీ సందడి 
  • స్వయంగా ఇమర్తి, బేసన్ లడ్డూలను తయారు చేసిన కాంగ్రెస్ నేత
  • రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీకి ఇమార్తి అంటే ఇష్టమని చెప్పిన యజమాని
  • త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ రాహుల్‌కు యజమాని సరదా విన్నపం
  • మీ పెళ్లి స్వీట్ల ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నామంటూ వ్యాఖ్య
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఒక ఆసక్తికర అనుభవం ఎదురైంది. దీపావళి పండుగ సందర్భంగా పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్‌కు వెళ్లిన ఆయనకు, అక్కడి యజమాని నుంచి ఊహించని విన్నపం వచ్చింది. "రాహుల్ జీ, దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి. మీ పెళ్లి స్వీట్ల ఆర్డర్ కోసం మేం ఎదురుచూస్తున్నాం" అంటూ యజమాని సుశాంత్ జైన్ చేసిన సరదా వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సోమవారం దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ, తన స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం స్వీట్లు కొనుగోలు చేయడానికి ఈ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా స్వీట్లు తయారుచేయడానికి ఆసక్తి చూపించారు. షాపు యజమాని సుశాంత్ జైన్ మాట్లాడుతూ, "రాహుల్ గారు స్వీట్లు కొనేందుకు వచ్చారు. ఇది మీ సొంత దుకాణమే అనుకోండి అంటూ నేను ఆయనకు స్వాగతం పలికాను. స్వీట్లను తానే స్వయంగా తయారుచేసి రుచి చూస్తానని ఆయన అన్నారు" అని తెలిపారు.

రాహుల్ తండ్రి, దివంగత రాజీవ్ గాంధీకి ఇమార్తి అంటే చాలా ఇష్టమని, అందుకే రాహుల్‌ను ఇమార్తి తయారు చేయమని కోరినట్లు జైన్ చెప్పారు. అలాగే, రాహుల్‌కు బేసన్ లడ్డూలు ఇష్టం కావడంతో వాటిని కూడా ఆయనే స్వయంగా తయారుచేశారని వివరించారు. ఈ క్రమంలోనే తాను రాహుల్‌తో సరదాగా పెళ్లి ప్రస్తావన తెచ్చినట్లు జైన్ పేర్కొన్నారు. "భారతదేశంలో అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి రాహుల్ గారే. అందుకే, ఆయన పెళ్లి కోసం మేం ఎదురుచూస్తున్నామని చెప్పాను" అని అన్నారు.

ఈ పర్యటనపై రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. "పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపులో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. శతాబ్దాల నాటి ఈ షాపులోని తీపిదనం ఇప్పటికీ స్వచ్ఛంగా, సంప్రదాయబద్ధంగా మనసును హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి మాధుర్యం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ పేర్కొన్నారు. "మీరు మీ దీపావళిని ఎలా జరుపుకుంటున్నారు?" అని ప్రజలను అడుగుతూ తన పోస్ట్‌ను ముగించారు.
Rahul Gandhi
Rahul Gandhi marriage
Ghantewala Sweet Shop
Diwali
Sushant Jain
Old Delhi
Congress
Imarti
Besan Laddu
Indian Sweets

More Telugu News