United Airlines: విమానాన్ని ఢీకొట్టింది అంతరిక్ష వ్యర్థాలా?... 36,000 అడుగుల ఎత్తులో హైటెన్షన్!

United Airlines Flight Damaged by Possible Space Debris
  • 6,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 విమానం
  • గుర్తు తెలియని వస్తువు ఢీకొని పగిలిన కాక్‌పిట్ అద్దం
  • పైలట్‌కు స్వల్ప గాయాలు, అత్యవసరంగా ల్యాండింగ్
  • అంతరిక్ష వ్యర్థాల పనేనని నిపుణుల అనుమానం
  • ప్రయాణికులంతా సురక్షితం, తప్పిన పెను ప్రమాదం
గాల్లో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అంతుచిక్కని వస్తువు ఒకటి అత్యంత వేగంగా ఢీకొట్టడంతో విమానం కాక్‌పిట్ ముందు ఉండే అద్దం (విండ్‌షీల్డ్) పగిలిపోయింది. ఈ ఘటనతో కాక్‌పిట్‌లో తీవ్ర ఆందోళన నెలకొన్నా, పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. అమెరికాలో గత గురువారం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం (ఫ్లైట్ 1093) డెన్వర్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరింది. విమానం 36,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక, ఓ భారీ శబ్దంతో కాక్‌పిట్ అద్దం పగిలింది. పగిలిన గాజు ముక్కలు కాక్‌పిట్ డ్యాష్‌బోర్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో ఓ పైలట్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు, విమానాన్ని సురక్షితమైన 26,000 అడుగుల ఎత్తుకు దించి, సాల్ట్ లేక్ సిటీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ప్రమాదం జరిగినప్పుడు విమానంలోని ప్రయాణికులెవరూ గాయపడలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల కోసం వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేసి వారి గమ్యస్థానమైన లాస్ ఏంజిల్స్‌కు పంపినట్లు పేర్కొంది. దెబ్బతిన్న విమానాన్ని మరమ్మతుల కోసం సాల్ట్ లేక్ సిటీలోనే నిలిపివేశారు.

అంతరిక్ష వ్యర్థాల పనేనా?

సాధారణంగా ఇంత ఎత్తులో పక్షులు గానీ, వాతావరణంలోని ఇతర వస్తువులు గానీ విమానాలను ఢీకొట్టే అవకాశం ఉండదు. దీంతో ఈ ప్రమాదానికి అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన వ్యర్థాలు (స్పేస్ డెబ్రిస్) లేదా చిన్న ఉల్క కారణమై ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అద్దం పగిలిన చోట కాలిన గుర్తులు ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

అయితే, అంతరిక్ష వ్యర్థాల వల్ల విమానాలకు ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం భూమి చుట్టూ 4 అంగుళాల కన్నా పెద్దవైన సుమారు 25,000 అంతరిక్ష వ్యర్థాలను నాసా ట్రాక్ చేస్తోంది. ఈ అరుదైన ఘటన విమానయాన భద్రతపై కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
United Airlines
Boeing 737 Max 8
Flight 1093
space debris
Salt Lake City
Federal Aviation Administration
FAA
plane accident
aircraft damage
Denver to Los Angeles

More Telugu News