Revanth Reddy: రేవంత్ రెడ్డి జీన్స్‌లోనే ఆరెస్సెస్ భావజాలం ఉంది: బాల్క సుమన్

Revanth Reddy Has RSS Ideology in His Genes Says Balka Suman
  • రేవంత్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారన్న బాల్క సుమన్
  • పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ ప్రభుత్వం గన్‌లతో బెదిరిస్తోందని విమర్శ
  • రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం లేదని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఆయన జీన్స్‌లోనే ఆరెస్సెస్ భావజాలం ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. తనది ఆరెస్సెస్ స్కూల్ అని గతంలో రేవంత్ స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన సుమన్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డికే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కూడా సీఎం రేవంత్‌పై ఈగ వాలకుండా చూస్తున్నారని, సదర్ ఉత్సవాల్లో బీజేపీతో ఆయనకున్న సంబంధం తేటతెల్లమైందని విమర్శించారు. ముఖ్యమంత్రిలో ఫ్యూడలిస్టు ఆలోచనలు కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చాక మంచిపై చెడు విజయం సాధిస్తున్న వాతావరణం కనిపిస్తోందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని గన్‌లతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని, ఒకరినొకరు తిట్టుకోవడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, సాటి మంత్రులే ఒక దళిత మంత్రిని చులకనగా మాట్లాడుతున్నారని సుమన్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేశారో లేదో చెప్పిన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారని అన్నారు. 
Revanth Reddy
Balka Suman
BRS
RSS ideology
Telangana politics
BJP
Congress government
Narendra Modi
Dalit attacks
Telangana news

More Telugu News