JC Prabhakar Reddy: మేము మొదలుపెడితే తట్టుకోలేరు: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy Warns YSRCP Leaders
  • వైసీపీ నేత కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక
  • 'ఇదే మీకు లాస్ట్ దీపావళి' వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ
  • మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరంటూ గట్టి వార్నింగ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ నేతలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. "ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నాడు. అలా అంటే మేం చూస్తూ ఊరుకోవాలా? మేం గనుక మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు" అంటూ జేసీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వెంకట్రామిరెడ్డికి ఆయన హితవు పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి వ్యక్తి కాబట్టే వైసీపీ నేతలు ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అడ్డుపడుతున్నారు కాబట్టే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, లేకపోతే మరోలా ఉండేదని పరోక్షంగా హెచ్చరించారు.

ఇదే సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జేసీ జోస్యం చెప్పారు. పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని ఆయన అన్నారు. "దేవుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరగొచ్చు. కానీ నా అంచనా ప్రకారం పెద్దారెడ్డి మళ్లీ గెలవలేడు. అయితే, ఆయన సోదరుడి కుమారుడు వెంకట్రామిరెడ్డి చిన్నవాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి మళ్లీ అవకాశం ఉండొచ్చు" అని జేసీ పేర్కొన్నారు.

అనంతరం, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై జరుగుతున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. "అసలు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేస్తే తప్పేంటి? దానిపై ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం రైల్వే సర్వీసులను ప్రైవేటీకరించలేదా? ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా?" అని జేసీ ప్రశ్నించారు. చివరకు తాను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో పనులను ప్రైవేట్ వ్యక్తులతోనే చేయించుకుంటున్నానని తెలిపారు. వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే టీడీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
JC Prabhakar Reddy
Tadipatri
YSRCP
Ketireddy Venkatarami Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Medical colleges privatization
TDP
Ketireddy Pedda Reddy
Political Warning

More Telugu News