Ram Pothineni: విజయవాడ కుల ఘర్షణల్లో మా కుటుంబం తలకిందులైంది.. హీరో రామ్ పోతినేని

Actor Ram Pothineni recalls family struggles after Vijayawada riots
  • సంపాదించిందంతా కోల్పోయి మా నాన్న జీరోకు వచ్చారు
  • హైదరాబాద్ లో పుట్టా, విజయవాడ, చెన్నైలలో పెరిగానన్న రామ్
  • జగపతి బాబు టీవీ షోలో ఆసక్తికర విశేషాలను పంచుకున్న నటుడు
విజయవాడలో 1988లో జరిగిన కుల ఘర్షణలు తమ కుటుంబంలో పెను మార్పులకు కారణమయ్యాయని హీరో రామ్‌ పోతినేని తెలిపారు. ఆ ఘర్షణల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుంటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఈ మేరకు జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

హైదరాబాద్ లోనే పుట్టా..
మా తల్లిగారిది హైదరాబాద్‌ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడ వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ ఘర్షణల్లో తమ కుటుంబం అప్పటివరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు.

బొమ్మల కోసమే ఓ గది..
విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఓ పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్లాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాక మొత్తం కోల్పోవడం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా, ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు.

స్టూడెంట్ అని చెబుతా..
విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళుతుంటానని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెబుతానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే.. దేవదాసు హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని తెలిపారు.
Ram Pothineni
Vijayawada
caste clashes
Jagapathi Babu
Jayammmu Nischayammura
Tollywood
Chennai
Chiranjeevi advice
family struggles

More Telugu News