Nara Lokesh: ఏపీ యువతకు ఆస్ట్రేలియా నైపుణ్యాలు.. మంత్రి లోకేశ్‌ కీలక భేటీ

Nara Lokesh Meets Australian Minister Andrew Giles on Skill Development
  • సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డ‌బ్ల్యూ క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్‌
  • ఆస్ట్రేలియా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రితో కీలక సమావేశం
  • ఏపీలో టీఏఎఫ్ఈ అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదన
  • రాష్ట్రంలోని ఐటీఐలకు పాఠ్యప్రణాళిక రూపకల్పనలో సహకారంపై చర్చ
  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆస్ట్రేలియా మంత్రికి ఆహ్వానం
  • ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ శిక్షణ, ఉపాధి అవకాశాలపై దృష్టి
ఏపీలో యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలోని ప్రఖ్యాత ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థ టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డ‌బ్ల్యూ(టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్) అల్టిమో క్యాంపస్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్‌తో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో, ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక కారిడార్లలో టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డ‌బ్ల్యూ స్కిల్ హబ్ లేదా అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను స్థాపించేందుకు ఏపీఎస్ఎస్‌డీసీ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని ఐటీఐలు, ఇతర నైపుణ్య శిక్షణా సంస్థలకు అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యప్రణాళికను రూపొందించడంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని లోకేశ్ సూచించారు. ఇరు దేశాల మధ్య విద్యార్థుల మార్పిడి (స్టూడెంట్ ఎక్స్చేంజి), క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చర్చించారు. ఐటీ, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, నిర్మాణ రంగాల వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులను ఏపీలో అందించాలని కోరారు.

అనంతరం, 2025లో విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న భాగస్వామ్య సదస్సుకు (Partnership Summit 2025) హాజరుకావాల్సిందిగా ఆండ్రూ గైల్స్‌ను లోకేశ్‌ ఆహ్వానించారు. అంతకుముందు, టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డ‌బ్ల్యూ క్యాంపస్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-అకడమిక్ భాగస్వామ్యంలో టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డ‌బ్ల్యూ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తోందని ఆస్ట్రేలియా మంత్రి గైల్స్ వివరించారు.

Nara Lokesh
Andhra Pradesh
Australia
Andrew Giles
Skill Development
APSSDC
TAFE NSW
Partnership Summit 2025
Visakhapatnam
International Education

More Telugu News