Mahadhan: తండ్రి బాటలో కాకుండా.. కొత్త దారిలో రవితేజ కొడుకు మహాధన్ ప్రయాణం!

Ravi Tejas Son Mahadhan to Become Director
  • హీరోగా కాకుండా దర్శకుడిగా మారనున్న రవితేజ కుమారుడు మహాధన్
  • ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి వద్ద అసిస్టెంట్‌గా చేరిక
  • సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి సహాయ దర్శకుడిగా పని
టాలీవుడ్‌లో వారసత్వం గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోల కొడుకులు హీరోలుగానే అరంగేట్రం చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తండ్రిలా వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని కాకుండా, తెరవెనుక ఉండి కథను నడిపించే దర్శకుడిగా మారేందుకు తొలి అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం మహాధన్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి, ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా (సూర్య 46) కోసం మహాధన్ దర్శకత్వ విభాగంలో చేరినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణంపై ఆసక్తితో, ఎంతో ఇష్టపడి తానే వెంకీ అట్లూరి బృందంలో చేరాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

నిజానికి మహాధన్‌కు నటన కొత్తేమీ కాదు. గతంలో తన తండ్రి నటించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. దీంతో భవిష్యత్తులో అతను హీరోగా వస్తాడని అందరూ ఊహించారు. అయితే, అతనికి నటన కంటే దర్శకత్వంపైనే ఎక్కువ ఆసక్తి ఉందని, వీలైనంత త్వరగా మెగాఫోన్ పట్టి సొంతంగా ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడని సమాచారం.

అయితే, మహాధన్ తన తొలి చిత్రాన్ని తండ్రి రవితేజతోనే చేస్తాడా లేక వేరే హీరోతో ముందుకొస్తాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో కొడుకు మూస ధోరణికి భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేయడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. 
Mahadhan
Ravi Teja
Tollywood
Venkky Atluri
Suriya 46
Director
Assistant Director
Lucky Bhaskar
Movie Direction
Telugu Cinema

More Telugu News